విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తల్లో ఎన్నికల ఊపు వచ్చేసిందన్నారు. యుద్ధానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. 2014లో వైసీపీ సమైక్యాంధ్ర ముసుగు డ్రామా ఆడిందని ఆరోపించారు. విభజన సమస్యల నుంచి టీడీపీయే ఒడ్డున పడేయగలదని నాడు ప్రజలు గెలిపించారని చంద్రబాబు గుర్తు చేశారు. ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి చేశామన్నారు. రైతులు, మహిళలు, యువతే మళ్లీ టీడీపీని గెలిపించాలని చంద్రబాబు కోరారు. విశ్వసనీయత, ధైర్యమే తన మనో బలమని చెప్పారు. టీడీపీని దెబ్బతీయడమే వైసీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్ లక్ష్యమన్నారు. విభజన చట్టం అమలుకు కేసీఆర్ సహకరించడం లేదని, ఉమ్మడి ఆస్తుల పంపిణీపై సుప్రీం తీర్పును కేంద్రం బేఖాతరు చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. 8 లక్షల ఓటరు దరఖాస్తులు వైసీపీ కుట్ర కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు. కార్యకర్తలను కూడా జైలుకు పంపాలని జగన్ ఆరాటపడ్తున్నారని చెప్పారు.