ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కారు కొంటానన్న ట్రంప్.. వైట్‌హౌస్‌కే షోరూంను తీసుకొచ్చిన మస్క్

international |  Suryaa Desk  | Published : Wed, Mar 12, 2025, 07:57 PM

టెస్లా నుంచి కారు కొనుగోలు చేస్తానంటూ డొనాల్డ్ ట్రంప్.. ఎలాన్ మస్క్‌కు ఇప్పటికే మాటిచ్చారు. ఈక్రమంలోనే నేడు కారును కొనుగోలు చేస్తానంటూ ట్రంప్ చెప్పగా.. మస్క్ టెస్లా షోరూంనే వైట్‌హౌస్‌కు తీసుకు వచ్చారు. లేటెస్ట్ మాడల్‌కు చెందిన 5 కార్లను తీసుకురాగా.. ట్రంప్ అందులోనుంచి ఓ ఎరుపు రంగు కారును సెలెక్ట్ చేసుకున్నారు. దాన్ని 80 వేల డాలర్లకు కొనుగోలు చేశారు. అయితే ఇందుకు మస్క్ డిస్కౌంట్ ఇస్తానని చెప్పినా.. ట్రంప్ తీసుకోకుండా పూర్తి డబ్బులను చెల్లించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.


టెస్లా, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ శాఖ నిర్ణయాల వల్ల అమెరికా వ్యాప్తంగా ఆయనపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ముఖ్యంగా ఆయనకు సంబంధించిన టెస్లా కార్లను ఎవరూ కొనుగోలు చేయొద్దని.. పూర్తిగా బహిష్కరించాలంటూ అమెరికన్లు పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తున్నారు. ఈక్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఎలాన్ మస్క్‌కు మద్దతుగా నిలిచారు. టెస్లాకు చెందిన కారును తానే కొంటానని.. ఇటీవలే మస్క్‌కు మాటిచ్చారు. అయితే తాజాగా దాన్ని నెరవేర్చబోతున్నట్లు చెప్పగా.. మస్క్ స్పందించారు.


మీరు షోరూంకు రావాల్సిన అవసరం లేదని వివరించి మరీ.. ట్రంప్ కోసం షోరూంనే వైట్‌హౌస్‌కు తీసుకెళ్లారు. ముఖ్యంగా ఐదు అత్యాధునిక మాడల్ కార్లను తీసుకు వెళ్లారు. వీటి ఫీచర్ల గురించి ఎలాన్ మస్క్‌యే.. నేరుగా ట్రంపునకు వివరించారు. ఈక్రమంలోనే అమెరికా అధ్యక్షుడు ఓ ఎరుపు రంగు కారును సెలెక్ట్ చేసుకున్నారు. ఆపై ఆ కారు ఎక్కి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నారు. మస్క్ కూడా పక్క సీట్లో కూర్చోగా.. ట్రంప్ ఇది చాలా బాగుందని చెప్పారు. దాన్నే కొనుగోలు చేస్తానని వివరించారు.


అది విన్న మస్క్.. ఇది చాలా వేగంగా వెళ్లే కారని, ఓసారి సీక్రెట్ సర్వీస్‌కు హార్ట్‌ఎటాక్ ఇద్దామా అంటూ జోక్ చేశారు. అయితే వాహనం నడిపేందుకు ట్రంపునకు అనమతి లేకపోవడంతో ఆయన టెస్ట్ డ్రైవ్ చేయలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా ట్రంప్‌యే ఈ వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.


ఇదంతా ఇలా ఉండగా.. అనంతరం ఇద్దరూ కలిసి మీడియాతో మాట్లాడారు. ట్రంప్ ముందుగా మాట్లాడుతూ.. ఈ కారును 80 వేల డాలర్లకు కొనుగోలు చేశానని చెప్పారు. మస్క్ దానికి డిస్కౌంట్ ఇచ్చేవారేనని కానీ.. తాను రాయితీ తీసుకుంటే ప్రతిపక్షాలు ఎన్నో ప్రయోజనాలు పొందారంటూ విమర్శలు చేస్తారని వివరించారు. అందుకే తాను ఎలాంటి డిస్కౌంట్ లేకుండానే ఈ కారును కొనుగోలు చేశానని స్పష్టం చేశారు. మీడియా ఎదుటే దీన్ని కొన్నానని.. ఇది అందరికీ తెలిసిందే అంటూ వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa