అసెంబ్లీ వేదికగా మహిళా సాధికారత గురించి సీఎం చంద్రబాబు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మహిళలను నమ్మించి మోసం చేస్తున్న చంద్రబాబుకు మహిళా సాధికారతపై మాట్లాడే అర్హతే లేదని అన్నారు. వైయస్ జగన్ హయాంలోనే రాష్ట్రంలో మహిళలకు ఆర్థిక స్వావలంభన సాధ్యపడిందని అన్నారు.ఆమె మాట్లాడుతూ..... ఎన్నికల్లో మహిళలకు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు వాటిని పూర్తిగా విస్మరించారు. గతంలో వైయస్ జగన్ గారు స్కూళ్ళలో డ్రాప్ అవుట్స్‌ను తగ్గించేందుకు గానూ అమ్మ ఒడి పథకాన్ని తీసుకువచ్చారు. దానిని చూసి కాపీ కొట్టి తల్లికి వందనంను కూటమి పార్టీలు ప్రకటించాయి. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఈ పథకాన్ని అమలు చేయకుండా నీరుగారుస్తున్నారు. తల్లికి వందనంకు ఏడాదికి వాస్తవానికి రూ.13వేల కోట్లు అవసరం కాగా తాజాగా 2025-26 ఆర్థిక సంవత్సరంకు బడ్జెట్‌లో రూ.8200 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం కొనసాగుతున్న 2024-25 సంవత్సరానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు అని వాపోయారు.
![]() |
![]() |