రాజధాని అమరావతి పనులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. మార్చి మూడవ వారంలో ప్రధాని శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లిన సమయంలో ప్రధానిని శంకుస్థాపనకు ఆహ్వానించారని సమాచారం. వచ్చే నెల మూడవ వారం వరకు ప్రధాని షెడ్యూల్ బిజీగా ఉండటంతో ఆ తరువాత షెడ్యూల్ ఖరారు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా రాజధాని పనులకు ప్రధాని శంకుస్థాన చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం రావడంతో రాజధాని పనులు ఆగిపోయాయి. ఆ తరువాత టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు కోరిన వెంటనే రాజధాని పనులకు ప్రపంచ బ్యాంక్ రుణం మంజూరు చేసింది. దీంతో పనులకు శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే సీఆర్డీఏ టెండర్లను ఖరారు చేస్తోంది. అయితే ప్రధాని పర్యటన ఖరారుకు సంబంధించి ధృవీకరణ లేదని అధికారులు చెబుతున్నారు.
![]() |
![]() |