తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, నేతలతో ఇవాళ (సోమవారం) ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని గుర్తుచేశారు. పాలనలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయని తెలిపారు. జిల్లాల్లో ఇన్‌చార్జ్ మంత్రులు తప్పనిసరిగా పర్యటించాలని ఆదేశించారు. అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు సూచించారు. జిల్లాలకు వెళ్లే సమయంలో ఆయా జిల్లా కో-ఆర్డినేటర్‌లు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు మంత్రులు సమాచారం అందజేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. గ్రూపు రాజకీయాలకు ఎక్కడా తావు ఇవ్వకూడదని ఆదేశించారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు వారి జిల్లాల్లో ఫోకస్ పెట్టాలని.. పర్యటనల సంఖ్య ఇంకా పెరగాలని సూచించారు. కార్యకర్తలు, నాయకులతో మమేకమవ్వడంతోపాటు జిల్లా పార్టీ కార్యాలయానికి తప్పకుండా వెళ్లాలని సూచించారు. ఏ స్థాయిలో కూడా వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదని చెప్పారు.
![]() |
![]() |