ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని కీలక చర్చలు

national |  Suryaa Desk  | Published : Fri, Mar 13, 2026, 06:18 PM

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న వేళ.. భారత ప్రధాని నరేంద్ర మోదీ దౌత్యపరమైన ముందడుగు వేశారు. గత నెలలో ఇరాన్ సంక్షోభం మొదలైన తర్వాత తొలి సారిగా ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసూద్ పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ గురువారం రాత్రి ఫోన్‌లో మాట్లాడారు. ఈ భీకర యుద్ధం వల్ల సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోవడం, మౌలిక సదుపాయాలు ధ్వంసం కావడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.


భారత ప్రయోజనాలే పరమావధి..


ఇరాన్ ప్రాంతంలోని తీవ్రమైన పరిస్థితిని చర్చించడానికి ఆదేశ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియన్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఇదే విషయాన్ని మోదీయే ఎక్స్ వేదికగా వెల్లడించారు. "ప్రాంతీయ భద్రత, శాంతి స్థాపన కోసం భారత్ కట్టుబడి ఉంది. ఉద్రిక్తతలు తగ్గించి చర్చలు, దౌత్యం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరాను" అని పేర్కొన్నారు. ఉద్రిక్తతలు పెరగడం, పౌరుల ప్రాణనష్టం, పౌర మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు వివరించారు. అలాగే వస్తువులు, ఇంధనాన్ని అడ్డంకులు లేకుండా రవాణా చేయాల్సిన అవసరంతో పాటు భారతీయ పౌరుల భద్రత, భారతదేశ ప్రధాన ప్రాధాన్యతలుగా ఉన్నాయని చెప్పారు.


ప్రపంచ వ్యాప్తంగా సరఫరా అయ్యే చమురు, ఎల్‌ఎన్‌జీ‌లో ఐదో వంతు ప్రయాణించే హార్మూజ్ జలసంధి ప్రస్తుతం యుద్ధం వల్ల స్తంభించిపోయింది. భారత్ దిగుమతి చేసుకునే ఎల్‌పీజీలో 90 శాతం ఈ మార్గం నుంచే వస్తుంది. ఇప్పటికే దేశంలోని అనేక రెస్టారెంట్లు గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నాయి. అయితే ప్రజలు ఆందోళన చెందవద్దని, ఇంధన సరఫరాను పర్యవేక్షించేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు హార్మూజ్ జలసంధిలో భారత జెండా ఉన్న నౌకలపై దాడి చేయమని, భారత్‌కు అనుమతిస్తామని ఇప్పటికే ఇరాన్ ప్రకటించిన విషయాన్ని కూడా గుర్తు చేసింది.


ప్రధాని మోదీ గత పది రోజుల్లో ఒమన్, కువైట్, సౌదీ అరేబియా, యూఏఈ, ఇజ్రాయెల్, ఖతార్ దేశాధినేతలతో మాట్లాడారు. కేవలం ఇరాన్‌లోనే సుమారు 10,000 మంది, ఇజ్రాయెల్‌లో 40,000 మంది భారతీయులు ఉన్నారు. వీరి రక్షణ కోసం విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా తన ఇరాన్ సహచరుడితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు ఇరాన్ సైనిక వర్గాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా సుదీర్ఘ కాలం యుద్ధం చేస్తామని హెచ్చరిస్తుండగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఇరాన్ పతనం ఖాయమని చెబుతున్నారు. ఈ సంక్లిష్ట పరిస్థితుల మధ్య భారత్ శాంతి దూతగా వ్యవహరిస్తూ తన పౌరుల మరియు ఆర్థిక ప్రయోజనాల రక్షణ కోసం గట్టిగా పోరాడుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa