దేశవ్యాప్తంగా మహిళా ఉద్యోగులకు, విద్యార్థినులకు నెలసరి సెలవులు తప్పనిసరి చేయాలన్న డిమాండ్‌పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి సెలవులను చట్టబద్ధం చేయడం వల్ల మహిళా సాధికారతకు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయ పడింది. "పీరియడ్స్ లీవ్ ఇవ్వాలని మేము చట్టం చేస్తే.. రేపు మహిళలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రారు" అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.
న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి పీరియడ్స్ లీవ్‌ను చట్టబద్ధం చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీన్ని శుక్రవారం రోజు విచారించిన సుప్రీం కోర్టు. యజమానుల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలని పిటిషనర్‌కు సూచించింది. "చైతన్యం కల్పించడం వేరు. చట్టం చేయడం వేరు. సెలవులను తప్పనిసరి చేస్తే.. మహిళలను నియమించుకోవడానికి కంపెనీలు భయపడతాయి. ఇది వారిని పురుషుల కంటే తక్కువగా చూసేలా చేస్తుంది. మీరు ఇంట్లోనే కూర్చోండి అని చెప్పే పరిస్థితి వస్తుంది" అని సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మహిళల కెరియర్ను ప్రమాదంలో పడేస్తుందని.. ఫలితంగా జ్యుడీషియరీ లేదా ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ వారి ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందని హెచ్చరించారు.
స్వచ్ఛంద నిర్ణయాలు వేరు.. చట్టం వేరు!
విచారణ సందర్భంగా సీనియర్ అడ్వకేట్ ఎం.ఆర్. శంషాద్ మాట్లాడుతూ.. కేరళ ప్రభుత్వం 2013లోనే అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థినులకు పీరియడ్స్ లీవ్ మంజూరు చేసిందని, లింగ సమానత్వం దిశగా అదొక గొప్ప అడుగు అని గుర్తు చేశారు. కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా ఇప్పటికే ఇలాంటి సెలవులను ఇస్తున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన సీజేఐ.. అవి స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయాలని, వాటిని చట్టబద్ధంగా అందరికీ వర్తింపజేయడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయని స్పష్టం చేశారు.
అయితే గత జనవరిలో సుప్రీం కోర్టు నెలసరి పరిశుభ్రతను బాలికల విద్యా హక్కు, గౌరవప్రదమైన జీవన హక్కులో భాగంగా గుర్తించింది. జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్ ధర్మాసనం.. ఆర్టికల్ 21 ప్రకారం మహిళల ఆరోగ్య హక్కును రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పేర్కొంది. పాఠశాలల్లో ఉచిత శానిటరీ నాప్కిన్లు, ప్రత్యేక మరుగుదొడ్లు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa