ఉత్తర ప్రదేశ్‌లో ఒక విడ్డూరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మూడు నెలల క్రితమే పెళ్లైన ఓ కొత్త పెళ్లి కూతురు ఇటీవలే హోలీ నిమిత్తం తల్లిగారింటికి వెళ్లింది. అయితే తిరిగి ఇంటికి తీసుకొచ్చుకునేందుకు వెళ్లిన భర్త ఆమెను వెంట పెట్టుకుని వచ్చాడు. అయితే మార్గమాధ్యంలో ఓ బస్టాండులో ఆగి ఉండగా.. ఆకలేస్తుంది ఒక ప్లేట్ పకోడి తీసుకురమ్మని భర్తను కోరింది. దీంతో అతడు పకోడి కోసం వెళ్లి పది నిమిషాల్లోనే తిరిగొచ్చాడు. కానీ అప్పటి వరకు తనతోనే ఉన్న భార్య మాత్రం అక్కడి నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఏం చేయాలో పాలుపోని అతడు.. ప్రయాణ ప్రాంగణమంతా వెతికి ఎక్కడా కనిపించకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అసలేం జరిగిందంటే..?
ఉత్తర ప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాకు చెందిన ప్రీతమ్ సింగ్‌కు.. రాంపూర్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల రిమ్‌జిమ్‌తో గతేడాది డిసెంబర్ 1వ తేదీన వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి వీరు బాగానే కలిసున్నారు. అయితే హోలి పండుగ సందర్భంగా రిమ్‌జిమ్ తన పుట్టింటికి వెళ్లింది. పండుగ అయిపోవడంతో.. భార్యను ఇంటికి తీసుకురావాలని అత్తారింటికి వెళ్లాడు ప్రీతమ్ సింగ్. అక్కడే వారు చేసిన మర్యాదలన్నీ స్వీకరించి భార్యను తీసుకుని మార్చి 9వ తేదీన తన ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో మొరాదాబాద్‌లోని బిలారి బస్టాండ్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న సమయంలో రిమ్‌జిమ్.. తనకు ఆకలిగా ఉందంటూ భర్త ప్రీతమ్ సింగ్‌కు చెప్పింది.
బాగా ఆకలి వేస్తోందని.. తనకోసం ఒక ప్లేటు వేడివేడి పకోడీలు తీసుకురమ్మని కోరింది. దీంతో ప్రీతమ్ పక్కనే ఉన్న స్టాల్ వద్దకు వెళ్లి పకోడీలు ఆర్డర్ ఇచ్చాడు. పదే పది నిమిషాల్లో వేడి వేడి పకోడీలు తీసుకుని భార్య కూర్చున్న చోటుకు వచ్చాడు. కానీ అక్కడ కూర్చుని ఉండాల్సిన రిమ్‌జిమ్ కనిపించలేదు. మొదట ఆమె ఎక్కడికైనా వెళ్లిందేమో అని బస్టాండ్ అంతా వెతికాడు. అక్కడి వారిని ఆరా తీసినా ఎవరూ ఆమెను చూడలేదని చెప్పారు. ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో ఆందోళన చెందిన ప్రీతమ్.. వెంటనే పోలీసులను ఆశ్రయించి మిస్సింగ్ కేసు ఫిర్యాదు చేశాడు.
ప్రియుడితో కలిసి వెళ్లిందా..?
పోలీసుల ప్రాథమిక విచారణలో ప్రీతమ్ కొన్ని కీలక విషయాలు వెల్లడించాడు. తన భార్య రిమ్‌జిమ్.. తన పుట్టింటి గ్రామానికి చెందిన ఒక యువకుడితో కలిసి పరారై ఉండవచ్చని తాను అనుమానిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. భార్య వెనుక ఏదైనా ముందస్తు పథకం ఉందేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు బస్టాండ్ పరిసరాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఆమె మొబైల్ ఫోన్ లొకేషన్‌ను ట్రాక్ చేసే పనిలో పడ్డారు. అయితే ప్రీతమ్ చెప్పినట్లుగా రిమ్‌జిమ్ నిజంగానే ఆమె ప్రియుడితోనే వెళ్లిందా లేక ఏమైనా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa