తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాపు సామాజికవర్గం చంద్రబాబును విశ్వసించడం లేదని, అందుకే పవన్‌తో పార్టీ పెట్టించారన్నారు. టీడీపీ, జనసేన రెండింటి మద్దతుతో 21 సీట్లు గెలుచుకున్న జనసేన అధినేత పవన్..వాపును చూసి బలుపు అనుకుంటున్నారని విమర్శించారు. జనసేన ఆవిర్భావ సభలో పవన్ ప్రసంగంపై అంబటి రాంబాబు స్పందించారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.... శాసనసభలోకి పవన్ కళ్యాణ్ మొదటిసారి ప్రవేశించిన తర్వాత ఈ సభ నిర్వహించారు. ప్రజలంతా మీడియా హడావుడి చూసి ఆయన ఏం చెబుతారోనని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తే, ఆయన ఏం చెప్పదలుచుకున్నారో ఆయనకైనా అర్థమైందా అనే అనుమానం కలిగేలా మాట్లాడాడు. 40 ఏళ్ల టీడీపీ పడిపోతుంటే నిలబెట్టామని మాత్రం ఆయన నిజం చెప్పారు. టీడీపీ పడిపోకుండా నిలబెట్టడానికి ఏర్పాటు చేసిన పార్టీ జనసేన అని మేం మొదట్నుంచి చెబుతూనే ఉన్నాం. కాపు సమాజం మీద అనేక దుశ్చర్యలకు పాల్పడిన చంద్రబాబు, కాపులను నేరుగా చేతుల్లోకి తీసుకోలేక టీడీపీ బీ టీమ్‌గా పనిచేయడానికి పవన్ కళ్యాణ్ సారథ్యంలో జనసేన ఏర్పాటు చేయించారు. కాపుల ఓట్లను తనవైపు తిప్పుకునే ప్రక్రియలో భాగంగానే ఈ పార్టీ ఏర్పాటు చేయబడిందని మొదటి రోజు నుంచి చెబుతూ వస్తున్నాం. చంద్రబాబుకి ఏ ఆపద వచ్చినా కాపు కాయడానికి పవన్ కళ్యాణ్ ముందుకొస్తాడు. కాబట్టే జనసేన పార్టీ మెయింటినెన్స్ బాధ్యతలన్నీ కూడా చంద్రబాబే చూస్తారు. ఒకసారి తెలుగుదేశం పార్టీకి సపోర్టు చేయడం, ఇంకో ఎన్నికల్లో వ్యతిరేక ఓట్లు చీల్చేలా ఇతర పార్టీలతో కలిసిపోటీ చేయడం.. ఇదంతా చంద్రబాబు ఆదేశాలతో చేస్తున్నదే తప్ప.. ఆయనకంటూ సొంత విధానాలున్నాయా? 11 ఏళ్లుగా చంద్రబాబు కోసం అవకాశవాద రాజకీయాలే చేశాడు కానీ, ఆయన రాష్ట్రం గురించి ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు అని అన్నారు.
![]() |
![]() |