హీరో విశ్వక్ సేన్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ ఫిలింనగర్ రోడ్డు నెంబర్- 8లోని తమ ఇంట్లో చోరీ జరిగినట్టు విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుటుంబమంతా ఒకే ఇంట్లో నివాసముంటుండగా.. విశ్వక్ సేన్ సోదరి వన్మయి బెడ్ రూమ్ మూడో అంతస్తులో ఉంటుంది. ఈరోజు (మార్చి 16న) తెల్లవారుజామున తన గదిలో వస్తువులన్ని చిందరవందరగా పడి ఉండడం గమనించింది వన్మయి. బెడ్ రూమ్‌లోని వాతావరణం చూసి అనుమానం వచ్చిన ఆమె.. అల్మారాలు పరిశీలించగా.. పలు బంగారు ఆభరణాలు కనిపించకపోవటంతో దొంగతనం జరిగినట్టు గుర్తించింది. దీంతో.. ఈ విషయాన్ని తన తండ్రి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు సేకరించారు. ఇంటి పరిసరాల్లోని సీసీటీనీ ఫుటేజీలను పరిశీలించారు. తెల్లవారుజామున 5 గంటల 50 నిమిషాల ప్రాంతంలో.. ఒక గుర్తుతెలియని వ్యక్తి బైక్ మీద వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తి గేటు తీసుకుని నేరుగా మూడో అంతస్తుకు వెళ్లి.. వెనుక డోర్ నుంచి విశ్వక్ సేన్ సోదరి వన్మయి బెడ్‌రూంలోకి వెళ్లి.. అల్మరాలో నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేసినట్టు గుర్తించారు.
సరిగ్గా 20 నిమిషాల్లోనే.. ఆ దుండగుడు తన పని ముగించుకుని వెళ్లి పోయినట్టు సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. ఈ చోరీలో రెండు డైమండ్ రింగులు పోయినట్టు సమాచారం. అయితే.. చోరీకి గురైన ఆభరణాల విలువ రూ.2.20 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగ కోసం గాలింపు చేపట్టారు. అయితే.. ఇంత ధైర్యంగా గేటు తీసుకుని నేరుగా మూడో అంతస్తుకు వెళ్లి.. కేవలం 20 నిమిషాల్లోనే పని ముగించుకుని.. దర్జాగా బయటకు వెళ్లిపోవడం చూస్తుంటే.. ఇది కచ్చితంగా ఎవరో తెలిసిన వ్యక్తి పనే అయ్యుంటుందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. అనుమానితులపై ప్రత్యేక నిఘా పెట్టారు.
![]() |
![]() |