జమ్మూలోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయంలో భద్రతా వైఫల్యం వెలుగుచూసింది. ఓ మహిళ తనిఖీలు నిర్వహించే భద్రతా సిబ్బంది కళ్లుగప్పి తుపాకీతో ఆలయంలోకి ప్రవేశించింది. ఈ నెల 15న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక మహిళ వద్ద ఆయుధాన్ని గుర్తించిన అధికారులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమె వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. సదరు మహిళను ఢిల్లీ పీఎస్‌లో పనిచేస్తున్న జ్యోతి గుప్తాగా పోలీసులు గుర్తించారు. గడువు ముగిసిన లైసెన్స్ డ్ తుపాకీని ఆమె ఆలయంలోకి తీసుకువచ్చారని, మహిళపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఆలయానికి వచ్చే భక్తులను ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఆయుధంతో ఆమె ఆలయంలోకి ప్రవేశించేవరకు భద్రతా సిబ్బంది ఎవరూ దానిని గుర్తించకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.
![]() |
![]() |