ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. విద్యాశాఖను మూసివేస్తూ ఉత్తర్వులు

international |  Suryaa Desk  | Published : Fri, Mar 21, 2025, 10:32 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 2.0 పాలనలో సంచలనలకు కేంద్ర బిందువుగా మారారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తూ.. అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ వ్యయాలను, వృథాను అరికట్టే చర్యలు చేపడతున్నారు. ఇందులో భాగంగా ఇటీవల విద్యాశాఖలోని ఉద్యోగాల్లో భారీగా కోతలు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆయన ఏకంగా విద్యాశాఖనే మూసివేశారు. దీనికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఆయన గురువారం సంతకం చేశారు. ఈ ఉత్తర్వులతో ఫెడరల్ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్ శాశ్వతంగా తొలగించడం మొదలైందని ట్రంప్ అన్నారు.


  ‘‘మేము వీలైనంత త్వరగా మూసివేస్తాం.. దీని వల్ల మాకు ఎటువంటి ప్రయోజనం లేదు.. విద్యను రాష్ట్రాలకు తిరిగి అప్పగించబోతున్నాం’’ అని వ్యాఖ్యానించారు. ట్రంప్ చర్యలతో రాష్ట్రాలు నిర్వహించే ఉచిత పాఠశాలలకు ఫెడరల్ ప్రభుత్వం నుంచి నిధులు, సహకారం నిలిచిపోనుంది. కాగా, 1979లో సృష్టించిన విద్యా శాఖను కాంగ్రెస్ ఆమోదం లేకుండా మూసివేయడం కుదరదు. కానీ ట్రంప్ ఉత్తర్వులు నిధులు, సిబ్బంది కొరతకు కారణమవుతాయి. విద్యాశాఖను మూసివేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అమెరికా విద్యా శాఖ మంత్రి లిండ్‌ మెక్‌మహన్‌ను ట్రంప్ ఆదేశించారు.


అయితే, ట్రంప్ నిర్ణయంపై ప్రతిపక్ష డెమొక్రాట్లు, విద్యావేత్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది నిరుంకుశత్వానికి, అధికారి దుర్వినియోగానికి నిదర్శమని ఆరోపిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న చర్యల్లో ఇది అత్యంత విధ్వంసకరమైంది, వినాశకరమైంది అని డెమొక్రాట్ సెనేటర్ చక్ షుమెర్ దుయ్యబట్టారు.


కాగా, వైట్‌హౌస్‌లో ఫ్లోరిడా, టెక్సాస్ గవర్నర్లు రాన్ డెశాంటిస్, గ్రెబ్ అబోట్‌లు సహా పలువురు రిపబ్లికన్ నేతలు పాల్గొన్న కార్యక్రమంలో ట్రంప్ విద్యా శాఖ మూసివేత ఉత్తర్వులపై సంతకం చేవారు. అమెరికాలో డబ్బు ఆదా చేయడానికి, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఈ చర్య అవసరమని.. మనం ఐరోపా, చైనాల కంటే వెనుకబడి ఉన్నామని పేర్కొన్నారు. కాగా, రిపబ్లికన్లు చాలా కాలంగా విద్యాశాఖపై నియంత్రణను సమాఖ్య ప్రభుత్వం నుంచి తొలగించాలని దశాబ్దాలుగా కోరుకుంటున్నారు.


సంప్రదాయంగా విద్యలో అమెరికా ఫెడరల్ ప్రభుత్వం అంతంతమాత్రమే. ప్రైమరీ, సెకెండరీ పాఠశాలకు ఫెడరల్ ప్రభుత్వం నుంచి కేవలం 13 శాతం నిధులు అందుతాయి. మిగతావి రాష్ట్రాలు, స్థానిక కమ్యూనిటీలు సమకూర్చుతాయి. కానీ, ఫెడరల్ ప్రభుత్వం నిధులు తక్కువ ఆదాయం కలిగిన పాఠశాలలు, విద్యార్థుల ప్రత్యేక అవసరాలకు చాలా కీలకం. అంతేకాదు, విద్యార్థులకు కీలకమైన పౌర హక్కుల రక్షణలో సమాఖ్య ప్రభుత్వం చాలా ముఖ్యమైంది. కాగా, ఇటీవలే ప్రపంచ రెజ్లింగ్ ఎంటర్‌టెయిన్‌మెంట్ మాజీ సీఈఓ మెక్‌మహన్‌ను విద్యాశాఖ మంత్రిగా ట్రంప్ నియమించారు. అంతలోనే ఆ శాఖను మూసివేస్తూ ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం. ఆమె విద్యాశాఖకు చిట్టచివరి మంత్రి అవుతారని ట్రంప్ వ్యాఖ్యానించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa