జనసేన ఎమ్మెల్సీ నాగబాబు తన తొలి అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలంలో ఈరోజు ఆయన పర్యటించారు. గొల్లప్రోలు మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అన్న క్యాంటీన్ ను నాగబాబు ప్రారంభించారు. అన్న క్యాంటీన్ ప్రారంభం సందర్భంగా అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. టీడీపీ, జనసేన కార్యకర్తలు పోటీపోటీగా నినాదాలు చేశారు. జై వర్మ అంటూ టీడీపీ శ్రేణులు, జై జనసేన అంటూ జనసేన శ్రేణులు నినదించాయి. అన్న క్యాంటీన్ దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో టీడీపీ నేత వర్మ ఫొటో లేదు. దీంతో ఆయనకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎవరి పార్టీ జెండాలతో ఆ పార్టీ కార్యకర్తలు హడావుడి చేశారు. మరోవైపు ఈ కార్యక్రమానికి వర్మను ఆహ్వానించినప్పటికీ ఆయన దూరంగా ఉన్నారు. వేరే కార్యక్రమాల ఉండటం వల్ల క్యాంటీన్ కార్యక్రమానికి తాను రావడం లేదని వర్మ తెలిపారు. మరోవైపు కార్యక్రమం ముగిసిన తర్వాత నాగబాబు కారు ఎక్కుతుండగా... జై వర్మ, వర్మ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. అయితే, నాగబాబు ఇవేమీ పట్టించుకోకుండా వెళ్లిపోయారు.
![]() |
![]() |