ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇద్దరు భార్యలకు తెలియకుండా..,,అర్ధరాత్రి బయటకెళ్లి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 03, 2025, 08:34 PM

సాగర తీరం విశాఖపట్నంలో శుక్రవారం జరిగిన ఓ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విశాఖపట్నం శివారు ప్రాంతమైన దాకమర్రిలో ఓ మహిళ మృతదేహం గుర్తుపట్టలేని రీతిలో కాలిపోయి కనిపించడం.. స్థానికులను భయాందోళనకు గురిచేసింది. శుక్రవారం ఉదయం మేకలు కాసేందుకు వెళ్లిన కాపరులు ఈ మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా.. చనిపోయింది ఎవరు, ఎవరు చంపారనే విషయంతో పాటు అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.


శుక్రవారం (మే 2) ఉదయం 10 గంటలు.. విశాఖ శివారు ప్రాంతం దాకమర్రి.. వీఎంఆర్డీఏ ఫార్చ్యూన్ లేఅవుట్‌ సమీప ప్రాంతానికి కొంతమంది మేకల కాపర్లు మేకలు కాస్తూ వెళ్లారు. అయితే అనుకోకుండా వారి కళ్లకో దృశ్యం కనిపించింది. అది చూడగానే ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది. శరీరమంతటా చెమటలు పట్టేశాయ్.. గట్టిగా అరుద్దామంటే నోరు పెగలడం లేదు.. అయినా ధైర్యం చేసి పోలీసులకు ఫోన్ చేశారు.. ఒక్కో పదం కూడబలుక్కుంటూ తమకు కనిపించిన విషయాన్ని పోలీసులకు చేరవేశారు. గుర్తుపట్టలేని స్థితిలో కాలిపోయిన ఓ మహిళ మృతదేహం కనిపించిందంటూ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ చూసిన సీన్ పోలీసులను సైతం ఒక్క క్షణం వణికించింది.


అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. చనిపోయింది ఎవరనే దానిపై ఆరా తీయటం మొదలెట్టారు. సోషల్ మీడియా ద్వారా ఫోటోలను షేర్ చేస్తూ.. మృతురాలి వివరాలను గుర్తించే పనిలో పడ్డారు. దర్యాప్తులో మృతురాలి వివరాలను కనిపెట్టిన భీమిలి పోలీసులు.. హత్య చేసింది ఎవరో, హత్యకు గల కారణాలు ఏంటో గంటల్లోనే కనిపెట్టారు. ఈ కేసుకు సంబంధించి విశాఖపట్నం పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం..


ఇద్దరు భార్యలు.. అయినా మరో మహిళతో..


చనిపోయిన మహిళ వయసు 38 ఏళ్లు.. ఇద్దరు కుమారులతో కలిసి నివసిస్తున్నారు. మే ఒకటో తేదీ రాత్రి ఫంక్షన్‌కు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వచ్చిన మహిళ.. మరుసటి రోజు ఉదయం శివారు ప్రాంతంలో శవమై తేలారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సాంకేతిక పద్ధతులను ఉపయోగించారు. ఈ క్రమంలోనే హత్య చేసింది ఒడిశాకు చెందిన క్రాంతి కుమార్ అనే వ్యక్తిగా గుర్తించారు. ఒడిశాకు చెందిన క్రాంతి కుమార్‌కు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు జరిగాయి. ఇద్దరు భార్యలు ఉన్నారు. రెండో భార్య, పిల్లలతో కలిసి నాలుగేళ్లుగా తగరపువలసలో అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలోనే క్రాంతి కుమార్‌కు ఈ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో మరింత సాన్నిహిత్యంగా మెలగడం మొదలుపెట్టారు. ఈ విషయమై క్రాంతి కుమార్ రెండో భార్యకు, మహిళకు గొడవలు కూడా జరిగినట్లు సమాచారం.


ఇక ఈ గొడవల కారణంగా క్రాంతి కుమార్ తన రెండో భార్యను అదే కాలనీలోని వేరే ఇంట్లోకి మార్చారు. అయితే ఈ మహిళతో తన సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇక ఈ మహిళతో సన్నిహితంగా ఉంటున్న విషయం క్రాంతి కుమార్ మొదటి భార్యకు కూడా తెలిసింది. దీంతో ఇద్దరు భార్యలతోనూ క్రాంతి కుమార్‌కు మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలోనే క్రాంతి కుమార్ ఈ మహిళను ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు.


ముందుగా వేసుకున్న పథకం ప్రకారం మే ఒకటో తేదీ రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన క్రాంతి కుమార్.. తన వెంట కత్తిని కూడా తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మహిళకు ఫోన్ చేసిన క్రాంతి కుమార్.. బైక్ మీద బయటకు వెళ్దామని చెప్పాడు. దీంతో ఆ మహిళ.. ఫంక్షన్ ఉందని ఇంట్లోని కుమారులకు చెప్పి బయటకు వచ్చారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బైక్ తెన్నేటి పార్క్ బీచ్ రోడ్డు వద్దకు వెళ్లారు. అక్కడ ఐస్ క్రీమ్ తిన్నారు. ఆ తర్వాత బైక్‌లో పెట్రోల్ అయిపోయిందని చెప్పిన క్రాంతి కుమార్.. పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ కొట్టించుకున్నాడు. అయితే ఖాళీ బాటిల్‌లో పెట్రోల్ కొట్టించుకోవడంతో మహిళ ప్రశ్నించింది. దీంతో తమ ఇంటి దగ్గర బైక్‌లోని పెట్రోల్ కాజేస్తున్నారంటూ ఆమెను క్రాంతి కుమార్ నమ్మించాడు. ఆ తర్వాత తిమ్మాపురం రామాద్రి దగ్గర ఉన్న బీచ్‌కు వెళ్లి నూడుల్స్ తిన్నారు.


రాత్రి ఒంటి గంట సమయంలో శారీరకంగా కలుద్దామని మహిళతో చెప్పిన క్రాంతి కుమార్ దాకమర్రి ఫార్చ్యూన్ హిల్స్ ఉడా లేఅవుట్ లోకి తీసుకెళ్లాడు. అక్కడకు వెళ్లిన తర్వాత వెంట తెచ్చుకున్న కత్తితో మహిళను గొంతుకోసి చంపిన క్రాంతికుమార్.. ఆమె ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్లు, పర్సు తీసేసుకున్నాడు. ఎవరూ గుర్తుపట్టకుండా, సాక్ష్యాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ పోసి తగలబెట్టాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం క్రాంతి కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. మరోవైపు ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోయినా గంటల వ్యవధిలోనే కేసును ఛేదించిన పోలీసులను విశాఖ పోలీస్ కమిషనర్ అభినందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa