రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. నూతన పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్న సంస్థలకు సత్వర అనుమతులు, పూర్తిస్థాయి సహకారం అందించాలని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రూ.91,839 కోట్ల పెట్టుబడితో, 1,41,407 ఉద్యోగాలను కల్పించేందుకు సుమారు 91 దిగ్గజ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఆ కంపెనీలకు అవసరమైన చేయూత అందించడంపై ఇవాళ అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఉండవల్లిలోని తన నివాసంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి లోకేశ్, రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్న ప్రతి పెద్ద కంపెనీకి ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమించాలని స్పష్టం చేశారు. దీనివల్ల అనుమతుల ప్రక్రియ వేగవంతమై, సంస్థలు త్వరితగతిన కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలవుతుందని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. విశాఖపట్నం నగరాన్ని అత్యాధునిక ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఐటీ కంపెనీలకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.పౌరసేవలను మరింత సులభతరం చేసే దిశగా, 'మన మిత్ర' యాప్‌లో అందుబాటులో ఉన్న 317 సేవలను నెలాఖరు నాటికి 400కు పెంచాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. ధృవపత్రాలకు బ్లాక్‌చెయిన్, క్యూఆర్ కోడ్ సాంకేతికత జోడించాలని, పన్నుల బకాయిల వివరాలను వాట్సాప్ ద్వారా తెలిపేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆర్టీజీఎస్‌లో డేటా పాయింట్లు, కేపీఐలను ఇంటిగ్రేట్ చేసి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల సమాచారాన్ని రియల్ టైమ్‌లో పొందుపరచాలన్నారు. వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే వ్యవస్థను పటిష్టం చేయాలని, విశాఖలో జూన్ 9, 10 తేదీల్లో జరిగే ఈ-గవర్నెన్స్ జాతీయ సదస్సుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని కోరారు.వివిధ ప్రభుత్వ శాఖల సమాచారాన్ని ఏకీకృతం చేసి, కృత్రిమ మేధ జోడించి ఒకే వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తేవాలని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను సరళతరం చేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని జీవోలు, యాప్‌లను ఒకే వేదికపైకి తెచ్చి, ప్రజలకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఐటీ కార్యదర్శి కాటంనేని భాస్కర్, ప్రత్యేక కార్యదర్శి బి.సుందర్, ఈడీబీ సీఈఓ సాయికాంత్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa