ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ డ్రోన్, మిసైళ్లను కూల్చేసిన ఆకాష్‌తీర్

national |  Suryaa Desk  | Published : Wed, May 14, 2025, 07:56 PM

ఆపరేషన్ సిందూర్ తర్వాత.. భారత్‌ పైకి పాకిస్తాన్ డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడింది. అయితే పాక్ చేసిన వైమానిక దాడులను భారత్ ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల సామర్థ్యం ముందు పాక్ మిసైళ్లు, డ్రోన్లు నిలవకపోవడంతో భారీ నష్టం తప్పింది. అయితే పాక్ దాడులను అడ్డుకునేందుకు భారత్‌కు ఒక రక్షణ కవచంగా ఆకాష్‌తీర్ నిలిచింది. స్వదేశీ పరిజ్ఞానంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ ఆకాష్‌తీర్.. భారత్‌కు ఒక ఐరన్ డోమ్‌ లాగా పనిచేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ ఆకాష్‌‌తీర్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా పనిచేసే ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ), ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ ఆకాష్‌‌తీర్‌ను రూపొందించాయి.


ఈ ఆకాష్‌‌తీర్‌.. పాక్ నుంచి వచ్చిన డ్రోన్లు, క్షిపణులు, చిన్న మానవరహిత వైమానిక వాహనాలను సమర్థవంతంగా తిప్పికొట్టింది. రియల్ టైమ్ టార్గెట్‌లను, డ్రోన్ల దాడికి అడ్డుకట్ట వేయడంలో ఈ ఆకాష్‌‌తీర్‌ చాలా ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఆకాష్‌‌తీర్‌ పూర్తిగా స్వదేశీ పరికరాలతో.. ఎలాంటి శాటిలైట్‌లపై ఆధారపడకుండా తయారు చేసిన మొట్టమొదటి ఆపరేషనల్ ఏఐ వార్ క్లౌడ్‌గా పేర్కొంటున్నారు. భారత క్షిపణులను గుర్తించడం, వాటిని అడ్డుకోవడంలో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్ వ్యవస్థలు ఫెయిల్ అయిన వేళ.. ఆకాష్‌‌తీర్‌ లాంటి మన వ్యవస్థలు అత్యంత కచ్చితత్వంతో పనిచేసినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నారు.


ఇస్రో ఉపగ్రహాలు, నావిక్ జీపీఎస్ సహా వివిధ మూలాల నుంచి డేటాను సేకరించి.. కంట్రోల్ రూమ్, రాడార్లు, ఎయిర్‌ డిఫెన్స్ తుపాకులకు సమగ్రమైన, రియల్ టైమ్ ఏరియల్ ఫోటోస్‌ను అందిస్తుంది. ఇది శత్రు విమానాలు, డ్రోన్లు, క్షిపణులను సొంతంగా గుర్తించి, ట్రాక్ చేసేందుకు ఉపయోగపడుతుంది. సాధారణ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కువగా భూ ఆధారిత రాడార్లు, మానవ పర్యవేక్షణ వ్యవస్థలపై ఆధారపడగా.. ఆకాష్‌‌తీర్‌ తక్కువ స్థాయి గగనతలాన్ని పర్యవేక్షించడానికి, భూ ఆధారిత వైమానిక రక్షణ ఆయుధ వ్యవస్థలను సమర్థవంతంగా నియంత్రించడానికి స్టెల్త్ డ్రోన్ ట్రాకింగ్, ఉపగ్రహ నిఘా, ఏఐ ఆధారిత నిర్ణయం తీసుకునే సాంకేతికతను ఉపయోగిస్తుంది.


ఈ ఆకాష్‌తీర్ వైమానిక రక్షణ వ్యవస్థతో భారత్ ఇప్పుడు అత్యాధునిక యుద్ధం చేసే పశ్చిమేతర దేశంగా అవతరించింది. ప్రపంచంలోని ఇతర వైమానిక రక్షణ వ్యవస్థల కంటే ఆకాష్‌తీర్ వేగంగా లక్ష్యాలను గుర్తించి, నిర్ణయం తీసుకుని, దాడి చేస్తుందని డీడీ న్యూస్ పేర్కొంది. ఈ ఆకాష్‌తీర్ సొంతంగా పనిచేస్తుంది. ఇందులోని డ్రోన్లు తమ ప్రయాణ మార్గాలను మార్చుకుని మరీ టార్గెట్లను గుర్తించి.. ఆపరేటర్ల జోక్యం లేకుండా దాడులు చేయగలవు. అంతేకాకుండా దీన్ని ఒక చోటు నుంచి మరో చోటుకు సులభంగా తరలించగలగడం వల్ల.. శత్రువులు ఉన్న ప్రాంతాల్లో దీన్ని ఉపయోగించడం తేలిక అవుతుంది. శత్రువుల లక్ష్యాలపై త్వరగా దాడి చేయడం మాత్రమే కాకుండా పోరాటం జరుగుతున్న గగనతలంలో తమ విమానాల భద్రతను కూడా సమన్వయం చేసుకుంటుందని డీడీ న్యూస్ వెల్లడించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa