తెలుగు సినిమా పరిశ్రమలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై, ముఖ్యంగా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సినిమాల విడుదల సమయంలో తలెత్తుతున్న వివాదాలపై రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ సినిమా విడుదల సమయంలోనే థియేటర్ల బంద్ వంటి సమస్యలు తెరపైకి రావడం వెనుక కచ్చితంగా కుట్ర కోణం ఉందని ఆయన ఆరోపించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినీ ప్రముఖులు చేతులు కట్టుకుని నిలబడ్డారని, ఇప్పుడు మాత్రం ప్రభుత్వంతో సంబంధం లేదన్నట్లు మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై మంత్రి దుర్గేశ్ మాట్లాడుతూ, "రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లు లీజుకు వెళ్లిపోయాయి తప్ప, సొంతంగా నడుపుతున్న యజమానులు తక్కువ. పదేళ్ల క్రితం ఏర్పడిన ఈ వ్యవస్థ వల్ల ఇబ్బందులు వస్తున్నాయా ముఖ్యంగా పవన్ కల్యాణ్ గారి సినిమా విడుదల సమయంలోనే ఇలాంటి పరిస్థితి ఎందుకు ఉత్పన్నమవుతోందనేది మా ప్రశ్న," అని అన్నారు.ప్రభుత్వం పరిశ్రమకు అన్ని విధాలా సహకరించడానికి సిద్ధంగా ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ విషయంలో పూర్తి నిబద్ధతతో ఉన్నారని మంత్రి తెలిపారు. "మేం ఎంత సహకరిద్దామన్నా వాస్తవాలు బయటకు రావాలి. దీనిపై పూర్తి వివరాలు తెలిస్తేనే భవిష్యత్తులో ఎలాంటి సహకారం అందించాలనే దానిపై స్పష్టత వస్తుంది. గత ప్రభుత్వ హయాంలో వాళ్ల పగ తీర్చుకోవడానికి చేశారు, మరి ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు మేం నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నాం," అని దుర్గేశ్ పేర్కొన్నారు.ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ "నాకు చక్కటి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు" అని అనడం వెనుక ఆయన తీవ్రమైన ఆవేదన ఉందని మంత్రి దుర్గేశ్ తెలిపారు. "ఆయన ఎంతగానో హర్ట్ అయ్యారు. సినిమా రంగానికి మేలు చేయాలని, టికెట్ రేట్ల విషయంలో కూడా ఇబ్బంది పెట్టొద్దని ఆయన పదేపదే చెప్పారు. పెద్ద, చిన్న నిర్మాతలనే తేడా లేకుండా అందరికీ సహకరించాం. అయినా ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరం," అని అన్నారు.నూతన సినిమా పాలసీని తీసుకురావడానికి త్వరలో కమిటీ వేస్తున్నామని, అందరికీ ఆమోదయోగ్యమైన విధానాన్ని రూపొందిస్తామని మంత్రి వివరించారు. "ఇన్ని చేస్తున్నప్పుడు కూడా ఈ సమయంలోనే థియేటర్ల బంద్ అనే మాట ఎందుకు వస్తుంది తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎగ్జిబిటర్లను అడిగితే బంద్‌కు సుముఖంగా లేమని, ఇప్పటికే నష్టాల్లో ఉన్నామని చెబుతున్నారు. ఈ వాతావరణం ఎందుకు కల్పిస్తున్నారో నిగ్గు తేలుస్తాం. దీని వెనుక కుట్ర లేదని ఎలా అనుకుంటాం" అని ప్రశ్నించారు.జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అనే వార్త వచ్చినప్పుడు ఫిలిం ఛాంబర్ ఎందుకు స్పష్టత ఇవ్వలేదని మంత్రి నిలదీశారు. "దామోదర్ ప్రసాద్ మాకు ఎవరితో సంబంధం లేదని, ప్రభుత్వ సహకారం అవసరం లేదని మాట్లాడటం సరికాదు. ప్రభుత్వం, పరిశ్రమ కలిసే పనిచేయాలి. జాయింట్ కలెక్టర్లు ప్రభుత్వంలో భాగం కాదా వారి ద్వారానే కదా బాగోగులు చూసేది అని అన్నారు. ఏడాది దాటినా కనీసం మర్యాదపూర్వకంగా కూడా కలవడానికి రాని సంఘాల తీరును కూడా ఆయన తప్పుబట్టారు.ఇకపై వ్యక్తిగతంగా ఎవరినీ ఎంటర్టైన్ చేయబోమని, వివిధ విభాగాలకు చెందిన సంఘాలు కలిసి వస్తేనే వారి సమస్యలు, ఆలోచనలపై స్పందిస్తామని మంత్రి దుర్గేశ్ స్పష్టం చేశారు. "ఉపముఖ్యమంత్రి గారు చెప్పినట్లు, వారు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, దానికి తగ్గట్టుగానే మేం కూడా వ్యవహరిస్తాం. ప్రభుత్వ సహకారం అక్కర్లేదనుకుంటే, దాని ఫలితాలు ఎలా ఉంటాయో వారే చూస్తారు. ప్రభుత్వం ఈ విషయంలో చాలా దృఢంగా ఉంటుంది," అని మంత్రి హెచ్చరించారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించి, వాస్తవాలు వెలుగులోకి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa