ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జైలు అధికారుల అవినీతి బాగోతం,,,హోటళ్లలో ఖైదీల జల్సాలు.. భార్యలు, లవర్స్‌తో ఎంజాయ్

national |  Suryaa Desk  | Published : Mon, May 26, 2025, 06:38 PM

రాజస్థాన్‌లోని జైళ్ల శాఖ అధికారులు అవినీతి బాగోతం బయటపెట్టే సంఘటన తాజాగా ఒకటి చోటు చేసుకుంది. జైలులో శిక్ష అనుభవించాల్సిన ఖైదీలు.. బయట తిరుగుతున్నారు. అంతేకాకుండా హోటల్‌లో విందులు, వినోదాలు జరుపుకుంటున్నారు. మెడికల్ టెస్ట్‌ల పేరుతో జైలు నుంచి బయటికి వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. జైలు అధికారులకు లంచాలు ముట్టజెప్పడంతో వారే స్వయంగా దగ్గరుండి ఖైదీలను బయటికి పంపిస్తున్నారు. అయితే పోలీసుల ఎస్కార్ట్, జైలు డాక్టర్ల పర్మిషన్‌తో కొందరు హై ప్రొఫైల్ ఖైదీలు ఇలాంటి పార్టీలు చేసుకుంటున్నట్లు తాజాగా బయటికి వచ్చింది. హోటల్ రూమ్‌లు బుక్ చేస్తే.. అందులో తమ భార్యలు, లవర్స్‌ను కలుస్తున్నారు. అయితే తాజాగా ఈ వ్యవహారం బయటికి రావడంతో ఖైదీలు, కానిస్టేబుల్‌లతోపాటు ఖైదీల బంధువులను కలిపి మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు.


జైపూర్ సెంట్రల్ జైలులో ఖైదీలకు వైద్య పరీక్షల పేరుతో హోటళ్లకు వెళ్లి షికార్లు కొట్టిన సంచలన ఘటన తాజాగా వెలుగులోకి రావడం తీవ్ర దుమారానికి కారణం అయింది. నలుగురు హై ప్రొఫైల్ ఖైదీలు రఫీక్ బక్రీ, భాన్వర్ లాల్, అంకిత్ బన్సాల్, కరణ్ గుప్తాలు.. జైలు డాక్టర్ల అనుమతి, పోలీస్ ఎస్కార్ట్‌ల సహకారంతో బయటికి వెళ్లి విందులు చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 13 మందిని అరెస్ట్ చేశారు, వీరిలో ఐదుగురు కానిస్టేబుళ్లు, నలుగురు ఖైదీలు, నలుగురు బంధువులు ఉన్నారు. ఈ అనధికారిక పర్యటనలకు ఖైదీలు రూ.25 వేలు చెల్లించినట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. తాజా కుంభకోణం జైపూర్ జైలు వ్యవస్థలో పాతుకుపోయిన అవినీతి, వసూళ్ల దందాను బయటికి తీసుకువచ్చింది.


శనివారం రోజున జైపూర్‌లోని ఒక హోటల్ లాబీ బయట.. జైలు గార్డులు టీ తాగుతుండగా.. లోపల ఇద్దరు హై ప్రొఫైల్ ఖైదీలు టిఫిన్ చేస్తుండటం కనిపించింది. అయితే ఆ ఖైదీల చేతికి బేడీలు లేకపోవడం గమనార్హం. ఇది పక్కన పెడితే అదే జైపూర్ నగరంలో మరో చోట.. మరో ఇద్దరు ఖైదీలు ఒక మహిళ పేరుతో బుక్ చేయబడిన గదిలో రెస్ట్ తీసుకున్నారు. ఈ ఇద్దరు ఖైదీల్లో ఒకరు శిక్ష పడిన వ్యక్తికి నమ్మకస్తుడు కాగా.. మరొకరు అతని సహచరుడు ఉన్నారు. వారిని కలిసిన మహిళల్లో ఒకరు అతని భార్య కాగా, మరొకరు అతని లవర్ అని తేలింది.


ఎస్ఎంఎస్ ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం మొత్తం ఐదుగురు ఖైదీలను తీసుకెళ్లాల్సి ఉండగా.. వారిలో కేవలం ఒక ఖైదీ మాత్రమే చివరికి ఆస్పత్రికి చేరుకున్నాడు. మిగిలిన రఫీక్ బక్రీ, భాన్వర్ లాల్, అంకిత్ బన్సాల్, కరణ్ గుప్తా అనే ఖైదీలు.. పోలీస్ ఎస్కార్ట్‌ల సహకారంతో నగరంలోని హోటళ్లకు చేరుకున్నారు. ఈ ఖైదీలు లైంగిక దాడి నుంచి హత్య వరకు అనేక కేసుల్లో దోషిగా తేలి శిక్ష అనుభవిస్తున్న వారు ఉన్నారు. అనారోగ్యం అని చెప్పి జైలు డాక్టర్ల వద్ద పర్మిషన్ తీసుకుని.. ఈ పర్యటనలు ప్లాన్ చేస్తే జైలు సిబ్బంది సహకరించినట్లు అర్థం అవుతోంది.


ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో.. ఆదివారం రోజున ఐదుగురు కానిస్టేబుళ్లు, నలుగురు ఖైదీలు, వారి బంధువులు నలుగురు సహా 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ జైలు వ్యవస్థ డబ్బుతో నడుస్తుందని.. అక్కడి డాక్టర్లు, సిబ్బంది, సీనియర్ అధికారులు అందరూ సహకరిస్తారని విచారణలో ఒక ఖైదీ అంగీకరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తడం మరిన్ని విమర్శలకు కారణం అయింది. దర్యాప్తు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఖైదీలు తమ అనధికారిక విందుల కోసం మధ్యవర్తి ద్వారా రూ.25 వేలు చెల్లించారని.. ఒక్కో ఎస్కార్ట్‌కు రూ.5 వేలు ఇస్తామని చెప్పడంతో ఎవరూ అడ్డు చెప్పలేదు.


రఫీక్, భాన్వర్ జలుపురా హోటల్‌లో రఫీక్ భార్య, భాన్వర్ మాజీ ప్రియురాలితో కలిశారని.. జైపూర్ డీసీపీ (తూర్పు) తేజస్విని గౌతమ్ తెలిపారు. రఫీక్ భార్య వద్ద మాదకద్రవ్యాలు లభ్యం కాగా.. ఆమెపై ఎన్‌‌డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అంకిత్, కరణ్ ఎయిర్‌పోర్టు సమీపంలోని ఒక హోటల్‌లో టిఫిన్ చేశారని.. ఆ హోటల్ రూమ్‌ను అంకిత్ లవర్ బుక్ చేసిందని వెల్లడించారు. శనివారం సాయంత్రం 5:30 గంటలకు నలుగురు తిరిగి జైలుకు చేరుకోవాల్సి ఉండగా.. ఎవరూ సరైన సమయలో రాలేదని గుర్తించారు. ఒక ఖైదీ బంధువు రూ.45 వేలతో హోటల్‌లో పట్టుబడినట్లు చెప్పారు. ఆ హోటల్ రూమ్ నుంచి పోలీసులు అనేక ఖైదీల ఐడీలను గుర్తించారు.


జైలు వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ మొత్తం వ్యవహారానికి ప్రధాన సూత్రధారి జైలు లోపల ఉన్న ఒక ఖైదీ అని గుర్తించారు. అతను జైలు సిబ్బంది, బయటి వ్యక్తుల నెట్‌వర్క్‌ను ఉపయోగించి ఇలాంటి కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడని తేల్చారు. ఏప్రిల్ నుంచి 200కి పైగా ఫోన్ కాల్స్‌ను ట్రేస్ చేయగా.. రాజస్థాన్ జైలు వ్యవస్థ భయానక చిత్రాన్ని చూపించాయని.. జైలులోకి ఫోన్లు విచ్చలవిడిగా వెళ్తున్నాయని తేలింది. కేసు ఫైల్‌ల కంటే వేగంగా లంచాలు కదులుతున్నాయని.. ఖైదీలు న్యాయ విచారణల లాగే ఈజీగా బయటికి వెళ్లి వస్తున్నారని తెలిపింది. అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, ఇతర వీవీఐపీలను బెదిరించడానికి ఖైదీలు జైలులో సెల్‌ఫోన్లను ఉపయోగించడం వంటి కీలక వార్తలతో జైపూర్ సెంట్రల్ జైలు గత నెలలో వార్తల్లో నిలిచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa