ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా హాళ్ల నిర్వహణను పటిష్టంగా ప్రేక్షకులకు నాణ్యమైన సేవలు అందించాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 27, 2025, 06:04 PM

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా హాళ్ల నిర్వహణను పటిష్టంగా చేపట్టి, ప్రేక్షకులకు నాణ్యమైన సేవలు అందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. పవన్ తో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ సమావేశమయ్యారు. సినిమా హాళ్ల బంద్ ప్రకటన, ఆ తర్వాత శాఖాపరంగా తీసుకున్న చర్యల గురించి పవన్ కు దుర్గేశ్ వివరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేశారు.కొత్త సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు వ్యక్తిగతంగా కాకుండా, తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి  ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించేలా పటిష్టమైన విధానాన్ని అమలు చేయాలని పవన్ స్పష్టం చేశారు. త్వరలో విడుదల కానున్న తన చిత్రం 'హరిహర వీరమల్లు'కు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని, నిర్మాత నేరుగా కాకుండా ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే ధరల పెంపు ప్రతిపాదనలు పంపాలని తేల్చిచెప్పారు. టికెట్ ధరలు, సినిమా హాళ్ల నిర్వహణ వంటి ఏ విషయంలోనైనా ప్రభుత్వ శాఖలు తమ విధులను కచ్చితంగా నిర్వర్తించాలని సూచించారు.సినిమా హాళ్లలో టికెట్ ధరలతో పాటు తినుబండారాలు, శీతల పానీయాలు, చివరికి వాటర్ బాటిల్ ధరలు కూడా అధికంగా ఉండటంపై సమావేశంలో చర్చ జరిగింది. వీటి వాస్తవ ధరలు, విక్రయ ధరలు, నాణ్యతా ప్రమాణాలపై సంబంధిత శాఖల అధికారులు నిరంతర పర్యవేక్షణ జరిపి, ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశించారు. మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్లలో ఆహార పదార్థాల వ్యాపారంలో గుత్తాధిపత్యం నడుస్తోందన్న విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చిందని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని మంత్రి దుర్గేశ్ కు సూచించారు. తినుబండారాల ధరలు అందుబాటులో ఉంటేనే ప్రేక్షకులు కుటుంబాలతో సినిమాకు వస్తారని, తద్వారా ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం కూడా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై పన్నుల శాఖతో సమీక్షించాలని తెలిపారు.సినిమా హాళ్ల బంద్ ప్రకటన వెనుక ఉన్న కారణాలు, కొందరు వ్యక్తుల ప్రమేయం, ఇద్దరు నిర్మాతలు తమకు సంబంధం లేదని ప్రకటించడం, తూర్పు గోదావరి జిల్లా నుంచే బంద్ ప్రకటన రావడం వంటి అంశాలపై చర్చించారు. బంద్ వెనుక ఒక నిర్మాత, థియేటర్లు కలిగిన రాజకీయ నాయకుడి ప్రమేయం ఉందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయాలని పవన్ సూచించారు. "ఈ బంద్ ప్రకటన వెనుక ఎవరున్నా, వారు జనసేన పార్టీకి చెందినవారైనా సరే, కఠిన చర్యలు తీసుకోవాలి. బెదిరింపులతో వ్యాపారాలు చేసే అనారోగ్యకర వాతావరణాన్ని సహించవద్దు" అని స్పష్టం చేశారు. సినిమా వ్యాపారం సజావుగా సాగేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి, ఇతర సినీ సంఘాలకు తెలియజేయాలని ఆదేశించారు. అలాగే, ప్రభుత్వం తీసుకురానున్న సమగ్ర సినిమా అభివృద్ధి పాలసీ కోసం సినీ పరిశ్రమలోని అన్ని వర్గాల నుంచి సూచనలు స్వీకరించాలని చెప్పారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa