ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా వరద ఉద్ధృతి కొనసాగుతోంది. అసోంలో వరద సృష్టించిన బీభత్సానికి ఇప్పటివరకు 17 మంది ప్రాణాలు కోల్పోగా, 21 జిల్లాల్లో 7 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 223 రిలీఫ్ క్యాంపుల్లో 39,746 మంది సురక్షితంగా ఆశ్రయం పొందుతున్నారు. సహాయక బృందాలు రక్షణ చర్యలు కొనసాగిస్తున్నాయి.
రోడ్డు, రైలు, ఫెర్రీ సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిక్కింలో కొండచరియలు విరిగిపడిన కారణంగా చిక్కుకున్న 34 మందిని రెండు Mi-17 V5 హెలికాప్టర్లలో సమీపంలోని పాక్యోంగ్ విమానాశ్రయానికి తరలించారు. ఇప్పటివరకు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న 1,700 మందిని తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సిక్కింలోని లాచెన్ నగరంలోని ఛతెన్ వద్ద ఉన్న ఆర్మీ క్యాంప్‌పై కొండచరియలు విరిగిపడగా.. ఆరుగురు సైనికులు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF)కి చెందిన 23 మంది సభ్యుల బృందం రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నది.