ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నెల 12న అమరావతిలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ''సుపరిపాలన - స్వర్ణాంధ్రప్రదేశ్'' పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యంగా సచివాలయం వెనుక భాగంలో సభా వేదికను నిర్మిస్తున్నారు. గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభలో ముఖ్యమంత్రి నారా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అమలు చేసిన నిర్ణయాలు, రాబోయే నాలుగేళ్లకు రూపొందించిన కార్యాచరణ కార్యక్రమంగా ఈ సభ మారబోతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు - ఏర్పాట్లకు దిక్సూచి ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని శాఖలతో సమన్వయం చేయిస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ దీనికి సంబంధించి జూన్ 9న అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీస్ అధికారులు, జిల్లా కలెక్టర్లు, శాఖల ప్రధానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా సూచించారు. అదే విధంగా, రాబోయే నాలుగేళ్లలో ఎలాంటి కార్యక్రమాలను చేపట్టబోతున్నారు, ప్రణాళికలు, నాలుగేళ్ల పాలన ఏ విధంగా కొనసాగనుంది అనే విషయాలను ఈ వేదిక ద్వారా తెలియజేసే అవకాశం ఉంది. రాబోయే నాలుగేళ్ల పాలనకు సంబంధించి ఇప్పటికే ముసాయిదాను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. అలాగే రేపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు, సంబరాలు నిర్వహించేందుకు కూటమి నేతలు సన్నద్ధమయ్యారు. పాలనలో ప్రాధాన్యతలు - భవిష్యత్తుపై దృష్టి ఈ సభలో ముఖ్యమంత్రి తన ప్రసంగం ద్వారా గత ఏడాది పాలనలో జరిగిన ముఖ్యమైన కార్యక్రమాలను ప్రస్తావించనున్నారు. విద్య, వైద్యం, మహిళా సంక్షేమం, రైతు పథకాలు, డిజిటల్ అడ్వాన్స్‌మెంట్, గ్రామీణ అభివృద్ధి వంటి అంశాలపై ప్రస్తావన ఉండే అవకాశం ఉంది. అలాగే నాలుగేళ్లలో స్వర్ణాంధ్ర అభివృద్ధి లక్ష్యంగా రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను ప్రజలకు తెలియజేయనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కొన్ని కీలక రంగాలపై స్ట్రాటజిక్ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా నీటి వనరుల అభివృద్ధి, వలస వెళ్లిన యూత్‌కు ఉపాధి అవకాశాలు, అమరావతి నిర్మాణ పునఃప్రారంభం వంటి అంశాలపై ప్రకటనలు వచ్చే అవకాశముంది. ప్రజలతో ప్రభుత్వం మమేకం అవుతుందా? ఈ సభ ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలతో మమేకం అవ్వాలన్న సంకల్పంతో ముందుకు సాగుతోంది. నారా చంద్రబాబు నాయుడి మాటల్లోనే 'ప్రతి గ్రామానికీ అభివృద్ధి, ప్రతి కుటుంబానికి సంక్షేమం' లక్ష్యంగా పాలనను కొనసాగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ కూడా రాష్ట్ర రాజకీయాల్లో శాశ్వతంగా కొనసాగాలన్న సంకల్పంతో ప్రజల సమస్యలను ముడిపెట్టి తన ప్రసంగాన్ని నడిపించే అవకాశం ఉంది. ఈ సభ ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవాలనుకుంటోంది. అయితే ప్రజలు దీనిని ఎలా స్వీకరిస్తారన్నదే కీలక అంశం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa