అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం కొన్ని నిమిషాల తర్వాత కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదం ( అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం)లో విమానంలో ప్రయాణిస్తున్న 242 మంది ప్రయాణికుల్లో 241 మంది మరణించారు. ఒక బ్రిటీష్ పౌరుడు అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డాడు. గత దశాబ్దంలో ఇది అతిపెద్ద విమాన ప్రమాదంగా చెప్పవచ్చు. ఈ ప్రమాదం తర్వాత మరణించిన వారి కుటుంబాలకు రూ. 1 కోటి ఎక్స్ గ్రేషియా ఇస్తామని టాటా గ్రూప్ ప్రకటించింది. అలాగే, ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడితో పాటు విమానం కూలిన భవనంలో గాయపడిన వారికి కూడా టాటా గ్రూప్ చికిత్స ఖర్చులను భరిస్తుందని తెలిపింది. అయితే ఇలాంటి ప్రమాదాల్లో విమానయాన సంస్థ సాధారణంగా ఏ రకమైన బీమా కవరేజీలను అందిస్తుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్సూరెన్స్ రంగంలోని నిపుణుల ప్రకారం.. వాణిజ్య విమానయాన సంస్థలు సాధారణంగా సమగ్ర విమానయాన బీమాను కొనుగోలు చేస్తాయి. వీటిలో సాధారణంగా హల్ ఇన్సూరెన్స్, ప్రయాణీకుల లయబిలిటీ బీమా, థర్డ్-పార్టీ లీగల్ లయబిలిటీ, కార్గో లయబిలిటీ, సిబ్బంది వ్యక్తిగత ప్రమాద బీమా వంటివి ఉంటాయి, హల్ ఇన్సూరెన్స్, లయబిలిటీ ఇన్సూరెన్స్ మధ్య వ్యత్యాసం ఏమిటంటే హల్ ఇన్సూరెన్స్ విమానానికి కలిగే భౌతిక నష్టాన్ని కవర్ చేస్తుంది.
ప్యాసింజర్ లయబిలిటీ బీమా ద్వారా ప్రయాణీకులు, విమానాశ్రయ సిబ్బంది లేదా భూమిపై ఉన్న వ్యక్తులకు గాయాలు కావడం, మరణించిన సందర్భంలో వర్తిస్తుంది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఆస్తి నష్టం నుంచి ఉత్పన్నమయ్యే చట్టపరమైన దావాల నుంచి రక్షిస్తుంది. హల్ ఇన్సూరెన్స్ విమానయాన సంస్థకు చెల్లిస్తే, లయబిలిటీ బీమా ప్రభావిత వ్యక్తులు లేదా వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లిస్తుంది.
దురదృష్టవశాత్తు ఇలాంటి ప్రమాదంలో ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోతే, ట్రావెల్ ఇన్సూరెన్స్ కింద ప్రమాదవశాత్తు మరణ ప్రయోజనం బాధిత కుటుంబానికి అందిస్తారు. సమ్ ఇన్సూర్డ్ రూ. 10 నుంచి రూ. 15 లక్షల వరకు లభిస్తుంది. ఇది ఆర్థికంగా కష్ట సమయాన్ని అధిగమించడానికి సహాయపడుతుంది. అలాగే అత్యవసర వైద్య తరలింపును కూడా ఈ పాలసీలు కవర్ చేస్తాయి, ప్రయాణికుడిని ఎయిర్‌లిఫ్ట్ చేయవలసి వస్తే లేదా అత్యవసర చికిత్స కోసం ప్రత్యేక వైద్య సదుపాయానికి తరలించవలసి వస్తే ఇది చాలా కీలకం అవుతుంది. అలాగే దురదృష్టవశాత్తు మరణం సంభవించినప్పుడు, బీమా మరణించిన వారి అవశేషాలను స్వదేశానికి తరలించే బాధ్యతను కూడా తీసుకుంటుంది.
భీమా క్లెయిమ్ ఎంత ఉంటుంది?
ఈ ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదంలో భారతీయ బీమా సంస్థలు, గ్లోబల్ రీఇన్సూరెన్స్ సంస్థల నుంచి వచ్చే మొత్తం బీమా క్లెయిమ్‌లు 120 డాలర్ల నుంచి 150 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,000 నుంచి రూ. 1,200 కోట్లు) వరకు ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఇందులో విమానం నష్టం సుమారు 80 మిలియన్ల డాలర్లు. ఇక ప్రయాణీకులు, థర్డ్-పార్టీ నష్టపరిహారం ఈ క్లెయిమ్ అధిక నికర విలువ కలిగిన ప్రయాణీకుల కారణంగా మరింత ఎక్కువగా ఉండవచ్చు. కొన్ని అంచనాల ప్రకారం, ప్రయాణీకులకు సంబంధించిన నష్టపరిహారం 100 మిలియన్ల డాలర్ల వరకు ఉండవచ్చు. హాస్టళ్లు లేదా సమీప పౌరులకు కలిగిన నష్టానికి కూడా బీమా కవరేజ్ ఉంది.
నష్టపరిహారం ఏ ప్రాతిపదికన ఇస్తారు?
భారతదేశం మోంట్రియల్ కన్వెన్షన్ 1999పై సంతకం చేసింది. దీని ప్రకారం విమాన ప్రమాదాలలో ప్రయాణీకుల కుటుంబాలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నష్టపరిహారం పొందుతాయి. ప్రమాదానికి విమానయాన సంస్థ నిర్లక్ష్యం నిరూపించబడకపోయినా, ప్రయాణీకుల బంధువులకు ప్రాథమిక మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుత రేట్ల ప్రకారం రూ. 1.3 కోట్ల కంటే ఎక్కువ ఉండవచ్చు. విమానయాన సంస్థ తప్పు లేదా నిర్లక్ష్యం నిరూపించబడితే, ఈ నష్టపరిహారం మరింత పెరగవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa