ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తే.. భారత్‌పై ప్రభావమెంత

international |  Suryaa Desk  | Published : Sun, Jun 22, 2025, 09:49 PM

గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. వీటి కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. 'గోరు చుట్టుపై రోకలి పోటులా' ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం వల్ల పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు.. ఈ పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌ అణు స్థావరాలపై అమెరికా చేపట్టిన దాడుల వల్ల.. భారత్‌కు ఇబ్బందులు ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఈ మేరకు ఇరాన్ తన 'బ్రహ్మాస్త్రాన్ని' ప్రయోగించడం ఖాయంగా కనిపిస్తోంది.


ప్రపంచ క్రూడ్ ఆయిల్ (చమురు) మార్కెట్‌కు జీవనాడిగా ఉన్న 'హర్మూజ్‌' జలసంధిని మూసివేసే దిశగా ఇరాన్ అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. దీనిపై ఇరాన్‌ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు.. ఆ దేశ పార్లమెంట్‌ సీనియర్‌ సభ్యుడు ఇస్మాయిల్‌ కౌసరి స్థానిక మీడియాతో చెప్పారు.


 అయితే 'హర్మూజ్‌' జలసంధిని మూసివేయడంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు.. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ నేతృత్వంలోని 'సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్'కు మాత్రమే అధికారం ఉంది. ఈ విషయానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఆర్డర్ జారీ కాలేదు. అయితే ప్రపంచార్థికాన్ని సవాల్ చేసే శక్తిమంతమైన ఆయుధం తన వద్ద ఉంది అని చెప్పేందుకే ఇరాన్ ఈ మేరకు హెచ్చరికలు పంపుతున్నట్లు అర్థమవుతోంది.


అసలేంటీ 'హర్మూజ్‌' జలసంధి..


ఇరాన్, ఓమన్ మధ్య ఉన్న ఇరుకైన వాటర్ వే హర్మూజ్ జలసంధి . ఇది పర్శియన్ గల్ఫ్, అరేబియన్ సముద్రాన్ని కలుపుతుంది. కేవలం 21 మైళ్లు వెడల్పు ఉండే ఈ చిన్న జలసంధి.. ప్రపంచవ్యాప్తంగా అవసరమయ్యే 20-25 శాతం ముడిచమురు సరఫరాను ఆపేయ్యగలదు. ఈ మార్గం ద్వారా ప్రతిరోజు 20 మిలియన్ (2 కోట్లు) బారెళ్ల క్రూడ్ ఆయిల్ వివిధ దేశాలకు సరఫరా అవుతుంది. 2023 లెక్కల ప్రకారం.. ఇందులో దాదాపు 17 మిలియన్ల బ్యారెళ్ల చమురు.. సౌదీ అరెబియా, యూఏఈ, ఇరాక్, కువైట్‌, ఖతార్ నుంచి ఎగుమతి అవుతోంది. ఇక ఖతార్ నుంచి లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ (ఎల్‌ఎన్‌జీ), ఇరాన్ నుంచి పెట్రోలియం రవాణా కూడా ఇదే మార్గం నుంచి సాగుతోంది. అంతేకాకుండా ఇదే మార్గంలో మూడింట ఒక వంతు ఎల్‌ఎన్‌జీ వివిధ దేశాలకు సరఫరా అవుతోంది.


భారత్‌పై తీవ్ర ప్రభావం


ఇరాన్‌ హర్మూజ్ జలసంధిని మూసేయాలని నిర్ణయం తీసుకుంటే.. భారత్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే భారత్‌ 90శాతం క్రూడ్ ఆయిల్‌ను విదేశాల నుంచే ఇంపోర్ట్ చేసుకుంటోంది. ఇక ఆ చమురు దిగుమతుల్లో 40శాతం.. హర్మూజ్‌ జలసంధి మార్గంలోనే వస్తోంది. ఇరానే తీసుకోబోయే ఆ నిర్ణయం.. ప్రపంచ మార్కెట్‌లో రూపాయి విలువపైనా ప్రభావం చూపిస్తుందని, ఇంధన ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


ఇప్పటికే బ్యారెల్‌ ముడిచమురు ధర 90 డాలర్ల వద్ద కదలాడుతోంది. ఇరాన్ హర్మూజ్‌ము మూసేస్తే.. బ్యారెల్ ధర 120 నుంచి 150 డాలర్లకు పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ ఎక్కువ కాలం ఆ జలసంధిని మూసేస్తే ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇది భారత్‌తో పాటు ముడి చమురు అధికంగా దిగుమతి చేసుకునే చైనా, జపాన్, యురోపియన్ యూనియన్‌పై ప్రభావం చూపనుంది.


ఇరాన్ దీన్ని మూసేస్తే.. ఆ మార్గం గుండా రవాణా సాగించే నౌకలపై ప్రభావం పడుతుంది. ఫలితంగా అవి వాటి రూట్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. దీంతో అత్యవసర వస్తువుల సరఫరా ఆలస్యం అవుతుంది. షిప్పింగ్ ధరలు కూడా ఆకాశాన్నంటుతాయి. ఫ్రెయిట్ టైమ్, ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా భారీగా పెరుగుతుంది. ఇరాన్ నిర్ణయంతో.. ఆసియా, ఐరోపాలో ఇంధన సంక్షోభం తలెత్తుతుంది. ముఖ్యంగా అత్యధికంగా దిగుమతి చేసుకునే చైనాలో.. ఇంధన కొరత, ద్రవ్యోల్బణంతో ఆర్థిక వ్యవస్థ నెమ్మగిస్తుంది. దీంతో వ్యూహాత్మక నిల్వలను వాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఇక ఇప్పటికే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్ల తీవ్ర ఇంధన కొరత (ముఖ్యంగా ఎల్‌ఎన్‌జీ దిగుమతుల్లో) ఎదుర్కొంటున్న ఐరోపాకు ఇది గొడ్డలిపెట్టే.


ఇంధన సరఫరాలో అంతరాయం, జాప్యం.. ద్రవ్యోల్బణం.. ప్రభావంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలవచ్చు. ముఖ్యంగా విమానయాన సంస్థలు, షిప్పింగ్, తయారీ వంటి రంగాలను ఇది ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. తద్వారా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులను.. వడ్డీ రేట్లను పెంచడానికి లేదా మార్కెట్లను నియంత్రించడానికి లిక్విడిటీని ఇంజెక్ట్ చేసేలా ఒత్తిడి తేవొచ్చు. ఇది ముఖ్యంగా ఇప్పటికే అప్పుల భారాన్ని మోస్తున్న.. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో మాంద్యం భయాలను రేకెత్తించవచ్చు.


అయితే ఇరాన్ ఏకపక్షంగా హర్మూజ్ జలసంధి మూసేయడం కూడా అంత ఈజీ కాదు. ఈ నిర్ణయం ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతంలో అమెరికా, యూకే, ఫ్రాన్స్‌కు చెందిన నావికా దళాల బేస్‌లు ఉన్నాయి. ఎస్కార్ట్ మిషన్లు లేదా సైనిక దాడుల ద్వారా జలసంధిని తెరిచి ఉంచడానికి ఆయా దేశాలు యుద్ధనౌకలను మోహరించే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa