ఎయిరిండియా విమానయాన సంస్థ టాటా గ్రూప్ చేతికి వచ్చాక సేవలు మెరుగుపడతాయని ఆశించిన ప్రయాణికులకు నిరాశ తప్పడంలేదు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విమానాలను రద్దు చేయడం, ప్రయాణ తేదీలను మార్చేయడంతో గమ్యస్థానాలకు చేరలేక ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ గందరగోళం కారణంగా ఒకే కుటుంబంలోని సభ్యులు వేర్వేరు రోజుల్లో ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. సంస్థ కస్టమర్ కేర్ నుంచి సరైన స్పందన లేకపోవడం, పరిహారం అందించకపోవడంపై ప్రయాణికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.అమెరికాలో నివసించే అనీష్ అగర్వాల్ కుటుంబానికి ఎదురైన అనుభవం ఈ సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. వారి కుటుంబ సభ్యులు టొరంటో నుంచి ఢిల్లీ మీదుగా పుణెకు ప్రయాణించాల్సి ఉండగా, చివరి నిమిషంలో ఎయిర్ ఇండియా వారి ప్రయాణ తేదీలను మార్చేసింది. దీంతో అనీష్ సోదరుడు ఒకరోజు, తండ్రి మరోరోజు, తల్లి ఇంకోరోజు ప్రయాణించాల్సిన విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ మార్పుల వల్ల అదనపు ఖర్చులు భరించాల్సి వచ్చిందని, సహాయం కోసం కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తే గంటల తరబడి హోల్డ్‌లో పెట్టి కాల్ కట్ చేశారని అనీష్ ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపై అనీష్ మాట్లాడుతూ, "ఇప్పుడు నా సోదరుడు శుక్రవారం, నాన్న ఆదివారం (జూన్ 29), అమ్మ సోమవారం (జూన్ 30) ప్రయాణిస్తున్నారు. ఈ మార్పుల వల్ల మేము టొరంటోలో అదనంగా మూడు రాత్రులు హోటల్ గదులు బుక్ చేసుకోవాల్సి వచ్చింది. అమెరికా నుంచి కస్టమర్ సపోర్ట్‌కు ఫోన్ చేస్తే, నాలుగు గంటల పాటు హోల్డ్‌లో పెట్టి కాల్ కట్ చేశారు. మాకు ఎలాంటి పరిష్కారం చూపలేదు" అని ఓ ఆంగ్ల పత్రికకు తన ఆవేదనను వెళ్లగక్కారు.ఇలాంటి ఘటనే ముంబై నుంచి నెవార్క్‌కు వెళ్లాల్సిన మరో కుటుంబానికి ఎదురైంది. నలుగురు కుటుంబ సభ్యులు కలిసి ప్రయాణించాల్సి ఉండగా, ఒకరికి మాత్రమే పాత తేదీలో ప్రయాణానికి అనుమతిచ్చి, మిగతా ముగ్గురి ప్రయాణాన్ని వేరే రోజుకు మార్చారు. వారు నలుగురు ముంబై నుంచి నెవార్క్‌కు ఎయిర్ ఇండియా విమానంలో (ఏఐ-191) శుక్రవారం ప్రయాణించాల్సి ఉండగా, గురువారం ఆ విమానాన్ని హఠాత్తుగా రద్దు చేశారు. శ్రీ వినాయక్ హాలిడేస్ యజమాని సంతోష్ గుప్తా మాట్లాడుతూ, "దీనిపై మేం ఎయిరిండియాను సంప్రదించగా... రద్దయిందని చెప్పిన అదే విమానంలో కుటుంబంలోని తల్లి శుక్రవారం ప్రయాణిస్తారని, మిగిలిన ముగ్గురు ఆదివారం (జూన్ 29) ఢిల్లీ మీదుగా నెవార్క్‌కు వెళతారని చెప్పారు. వారి కోసం మేము జనవరిలోనే టికెట్లు బుక్ చేశాం" అని తెలిపారు.అంతర్జాతీయ సర్వీసులను తాత్కాలికంగా తగ్గించడమే ఈ సమస్యలకు కారణమని ఎయిర్ ఇండియా వర్గాలు అనధికారికంగా అంగీకరిస్తున్నాయి. వేర్వేరు పీఎన్‌ఆర్ నంబర్లపై టికెట్లు బుక్ కావడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చని చెబుతున్నాయి. అయితే, సింగపూర్, లండన్ వంటి ఇతర మార్గాల్లోనూ ప్రయాణికులు ఇదే తరహా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చివరి నిమిషంలో విమానాలు రద్దు కావడం, సుదీర్ఘ లేఓవర్‌లతో ప్రత్యామ్నాయాలు చూపడం వంటి చర్యలపై సోషల్ మీడియాలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ వరుస ఘటనలతో ఎయిర్ ఇండియా సేవలపై ప్రయాణికుల్లో నమ్మకం సన్నగిల్లుతోంది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa