ముఖ్యమంత్రిగా ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా జీరో పావర్టీ పీ4 కార్యక్రమం తన మనసుకు దగ్గరగా ఉన్న కార్యక్రమమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పీ-4 కార్యక్రమంలో భాగంగా పేదలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన మార్గదర్శులకు శుక్రవారం నాడు క్యాంప్ కార్యాలయంలో సీఎం విందు ఇచ్చారు. ఈ సందర్భంగా వారితో చంద్రబాబు మనసు విప్పి మాట్లాడారు. పీ-4 కార్యక్రమంపై తన ఆలోచనలను.. తాను పెట్టుకున్న లక్ష్యాలను పంచుకున్నారు. పీ4పై మార్గదర్శుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. "సంపన్నులు సాయం చేస్తే.. పేదరికం తగ్గుతుంది. ఈ ఏడాది ఆగస్ట్ 15 నాటికి 15 లక్షల మంది బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలనేది నా సంకల్పం. ఇందుకు సంపన్నులు, కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి రావాలి. అంబేద్కర్ నుంచి అబ్దుల్ కలాం వరకు ఎంతోమందిని ఉన్నత స్థానానికి ఎదిగేలా చేసేందుకు వారి జీవితంలో ఎవరో ఒకరు సాయం చేశారు. సమాజంలో విజయం సాధించిన అందరూ సామాజిక బాధ్యతగా సమాజం కోసం తిరిగి ఖర్చు పెట్టాలి. గేట్స్ ఫౌండేషన్ ఈ విషయంలో స్ఫూర్తిగా నిలుస్తుంది. 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చూసేందుకు కృషి చేస్తున్నాను. రాష్ట్రంలో ఇప్పటివరకు 5 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించాం. వీరికి సాయం చేసేందుకు 47 వేల మంది మార్గదర్శులుగా నమోదు చేసుకున్నారు" అని ముఖ్యమంత్రి చెప్పారు."47 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండో విడత సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఐటీకి పెద్దపీట వేశాను. విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాను. ఇవన్నీ మంచి ఫలితాలను ఇచ్చాయి. తెలుగు ప్రజలు అన్నింటా అభివృద్ధి చెందారు. సంపద సృష్టించగలిగాం. దీంతో సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగాం. అలాగే, జన్మభూమి వంటి కార్యక్రమం ద్వారా అందరినీ అభివృద్ధిలో భాగస్వాముల్ని చేశాం.రాష్ట్రంలో అట్టడుగున ఉన్న 20 శాతం పేదలను ఆర్ధికంగా, సామాజికంగా పైకి తీసుకురావాలన్నదే నా సంకల్పం. పేదల భవిష్యత్ బంగారుమయం చేసేందుకు పీ4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం" అని సీఎం అన్నారు. సీఎం చంద్రబాబు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పలువురు మార్గదర్శులు ప్రశంసించారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు.. ఆశయాలకు తాము అండగా ఉంటామని చెప్పారు. పేదల కోసం ఇంతగా ఆలోచన చేసిన నాయకుడ్ని గతంలో తామెప్పుడూ చూడలేదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, స్వర్ణాంధ్ర-పీ4 ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ కుటుంబరావు, ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శ్రీని రాజు, రవి సన్నారెడ్డి-శ్రీ సిటి, అనిల్ చలమలశెట్టి-గ్రీన్కో, డాంగ్ లీ-కియా మోటార్స్, పీవీ కృష్ణారెడ్డి-మెగా ఇంజనీరింగ్, ఏఏవీ రంగరాజు-ఎన్ సి సి, వీవీఎన్ రావు-జీఎమ్మార్, సజ్జన్ కుమార్ గోయెంకా-జయరాజ్ ఇస్పాత్ లిమిటెడ్, దొరైస్వామి-బ్రాండిక్స్, సతీష్ రెడ్డి-రెడ్డి ల్యాబ్స్, సుచిత్రా ఎల్లా-భారత్ బయోటెక్, జయకృష్ణ-అమర్ రాజా, శ్రీనివాసరావు-బీఎస్సార్, పూజా యాదవ్-హీరో మోటార్స్ కార్పోరేషన్, విక్రమ్ నారాయణరావు- లాయడ్ హెల్త్ కేర్, ఇంద్రకుమార్-అవంతి ఫీడ్స్, శివప్రసాద్-హెచ్సీఎల్, గురు-సెల్ కాన్ మొబైల్స్, మాధవ్-రిలయన్స్, పీవీ వెంకటరమణ రాజు-రామ్ కో, ఎం. శ్రీనివాసరావు-జెమిని ఎడిబుల్స్ సంస్థల నుంచి విందు సమావేశానికి హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa