సోలార్, విండ్ ఎనర్జీ టాలెంట్ హబ్ గా ఆంధ్రప్రదేశ్' అనే అంశంపై సదస్సు మారుతున్న కాలానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ద్వారా భవిష్యత్ లో అద్భుతమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. విజయవాడ నోవాటెల్ హోటల్ లో 'సోలార్, విండ్ ఎనర్జీ టాలెంట్ హబ్ గా ఆంధ్రప్రదేశ్' అనే అంశంపై ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, స్వనీతి ఇనీషియేటివ్ సంయుక్తంగా నిర్వహించిన గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్ కు మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కాన్ఫరెన్స్ కేవలం దేశ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్ ను శక్తివంతం చేయడం, సౌర, పవన శక్తికి నైపుణ్య హబ్ గా ఏపీని తీర్చిదిద్దడమే కాదు.. ప్రపంచ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్ ను శక్తివంతం చేసే దిశగా ఈ కాన్ఫరెన్స్ ను నిర్వహించడం జరుగుతోంది. తద్వారా మన యువతకు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి అని వెల్లడించారు.దేశంలో ఏ పార్టీ సాధించని విధంగా కూటమి ప్రభుత్వం 94 శాతం స్ట్రైక్ రేట్ తో 164 సీట్లను కైవసం చేసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం. ఇందుకోసం అందరం కష్టపడి పనిచేస్తున్నాం. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం. క్లస్టర్ విధానంలో పెట్టుబడులను ఆకర్షిస్తాం. ఇందుకు కావాల్సిన ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేస్తాం. అనంతలో ఆటోమొబైల్, కర్నూలు రెన్యువబుల్ ఎనర్జీ, కడప, చిత్తూరును ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా, నెల్లూరులో ఎయిర్ కండిషనర్స్ వంటి స్పెషలైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రకాశం జిల్లాను సీబీజీ హబ్ గా, గుంటూరు, కృష్ణాను క్యాంటమ్ వ్యాలీ హబ్ గా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను ఆక్వా హబ్ గా, ఉత్తరాంధ్రను ఫార్మా, డేటా సెంటర్, ఐటీ హబ్ గా, మెడికల్ డివైస్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ గా తయారు చేస్తాం. ప్రతి వంద కిలోమీటర్లకు ఓ క్లస్టర్ ఏర్పాటుచేసి ఆయా రంగాల్లో టాప్ 20 కంపెనీలను తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నాం. దీంతో పాటు నైపుణ్యం పెంపు, నవీన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తున్నాయి. ప్రైవేటు సెక్టార్ తో నైపుణ్యం గల యువతను అనుసంధానించాల్సిన అవసరం ఉంది. సెప్టెంబర్ 1న నైపుణ్యం పోర్టల్ ను ప్రారంభించడం జరుగుతోంది. స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, సీడాప్ ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తాం. ప్రపంచ అవసరాలకు అనుగుణంగా అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రపంచవ్యాప్తంగా అనేక అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం రాష్ట్రం చొరవ తీసుకుని యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందిస్తాం. అవకాశాలను అందిపుచ్చుకునేలా యువతను సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. నా ఛాలెంజ్ ను స్వీకరించి సుజ్లాన్ సంస్థ ఇప్పటికే 2 నైపుణ్య శిక్షణా కేంద్రాలను నిర్మించింది. అవి ఇప్పటికే పనిచేస్తున్నాయి.గ్రీన్ ఎనర్జీ రంగం ద్వారా మహిళలకు వారి గ్రామాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. యువగళం పాదయాత్ర సమయంలో అనంత జిల్లాలోని కియా యాన్సిలరీ యూనిట్స్ లో మహిళలు పనిచేయడం చూశాను. ఓ మహిళ నా వద్దకు వచ్చి నాతో పాటు నడిచారు. ఏం చేస్తున్నారని ఆ మహిళను ప్రశ్నించగా.. తాను కియా యాన్సిలరీ యూనిట్స్ లో పనిచేస్తున్నానని, గతంలో సాధారణ గృహిణిగా ఉన్న తాను ఇప్పుడు నెలకు రూ.40 వేలు సంపాదిస్తూ కుటుంబానికి అండగా నిలిచానని గర్వంగా చెప్పారు. ఇప్పుడు కుటుంబంలో తనకు ఎంతో గౌరవం దక్కుతోందని చెప్పారు. ఒక్క కియా పరిశ్రమ వల్ల అనంతపురం జిల్లాలో వచ్చిన మార్పు ఇది. గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా విస్తృత అవకాశాలు ఉన్నాయి. అందుకే విండ్, సోలార్, రెన్యువబుల్, పంప్డ్ స్టోరేజీ, సీబీజీ ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టిసారించాం. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై గౌరవ సీఎం చంద్రబాబు గారు చాలా పట్టుదలతో ఉన్నారు. దీనిని చాలా ప్రాముఖ్యతగా తీసుకున్నాం. ఇందుకోసం ప్రైవేటు సెక్టార్ తో కలిసి పనిచేస్తాం. ఓంక్యాప్ ద్వారా యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఏపిఎస్ఎస్ డిసి ఛైర్మెన్ బూరుగుపల్లి శేషారావు, ఎన్ఆర్ఈడీసీఏపీ వైస్ చైర్మెన్ కమలాకర్ బాబు, స్వనీతి ఇనీషియేటివ్ సీఈఓ రీత్వికా భట్టాచార్య పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa