ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల భద్రత, జంతువుల హక్కుల మధ్య సమతుల్యత అవసరమన్న సుప్రీంకోర్టు

national |  Suryaa Desk  | Published : Wed, Aug 13, 2025, 03:54 PM

ఢిల్లీలో తీవ్రమైన సమస్యగా మారిన వీధికుక్కల బెడదపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. వీటి వల్ల రేబిస్ మరణాలు పెరుగుతున్నాయని, 8 వారాల్లోపు వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని జస్టిస్ పార్థివాలి, జస్టిస్ ఆర్.మహదేవన్ లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఈ తీర్పుపై పలువురు ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తీర్పుపై పునరాలోచించాలని కోరతూ చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు.ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పందించింది. ఈ విషయంలో ప్రజల భద్రతకు, మూగజీవాల హక్కులకు మధ్య కచ్చితమైన సమతుల్యత సాధించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. వీధికుక్కల సమస్యకు భావోద్వేగాలతో కాకుండా హేతుబద్ధమైన పరిష్కారం కనుగొనాలని భారత ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.వీధికుక్కల దాడులు, వాటి నియంత్రణకు సంబంధించిన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ బీఆర్‌ గవాయ్‌ మాట్లాడుతూ, "సమాజంలో వీధికుక్కలకు ఆహారం పెట్టే జంతు ప్రేమికులు ఉన్నారు, అదే సమయంలో వాటిని చూసి భయపడే సామాన్య ప్రజలూ ఉన్నారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేటప్పుడు ఇరువర్గాల వాదనలను పరిగణనలోకి తీసుకోవాలి" అని అన్నారు. సమస్య తీవ్రతను తాము గుర్తిస్తున్నామని, దీనికి ఒక ఆచరణాత్మకమైన పరిష్కారం కనుగొనడమే లక్ష్యమని తెలిపారు.కొన్ని ప్రాంతాలలో వీధికుక్కలు ప్రజలపై, ముఖ్యంగా పిల్లలపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని ధర్మాసనం పేర్కొంది. అయితే, వాటిని విచక్షణారహితంగా చంపడం కూడా పరిష్కారం కాదని స్పష్టం చేసింది. జంతు జనన నియంత్రణ  నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడంలో స్థానిక సంస్థల పాత్ర కీలకమని గుర్తుచేసింది. ఈ సమస్యను మానవ-జంతు సంఘర్షణగా చూడకుండా, ఇద్దరికీ ఆమోదయోగ్యమైన మార్గాన్ని అన్వేషించాలని సూచించింది.ఈ అంశంపై ఒక సమగ్రమైన పరిష్కార మార్గాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తామని చెబుతూ, తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా కోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa