ప్రస్తుత డిజిటల్ యుగంలో పిల్లలు స్మార్ట్‌ఫోన్లు, ఆన్‌లైన్ క్లాసులు, వీడియో గేమ్‌లతో గంటల తరబడి గడుపుతున్నారు. ఈ అలవాటు వారి ఏకాగ్రతను, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, భవిష్యత్తులో వారి గుండె ఆరోగ్యాన్ని కూడా తీవ్ర ప్రమాదంలో పడేస్తుందని ఒక కొత్త అధ్యయనం హెచ్చరిస్తోంది. కేవలం వినోదం కోసం గడిపే ప్రతి అదనపు గంట స్క్రీన్ సమయం పిల్లలు, యువతలో గుండె సంబంధిత వ్యాధుల ముప్పును (కార్డియోమెటబాలిక్ రిస్క్) పెంచుతున్నట్లు ‘జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్’లో ప్రచురితమైన ఈ పరిశోధన స్పష్టం చేసింది.డెన్మార్క్‌కు చెందిన 1,000 మందికి పైగా తల్లీపిల్లలపై జరిపిన ఈ సుదీర్ఘ అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పరిశోధకులు పిల్లల స్క్రీన్ సమయం, నిద్ర, శారీరక శ్రమ వంటి అంశాలను నమోదు చేసుకున్నారు. నడుము చుట్టుకొలత, రక్తపోటు, కొలెస్ట్రాల్, ట్రెగ్లిజరైడ్లు, రక్తంలో గ్లూకోజ్ వంటి ఐదు కీలక మార్కర్ల ఆధారంగా కార్డియోమెటబాలిక్ ప్రమాదాన్ని అంచనా వేశారు.ఈ అధ్యయనం ప్రకారం వినోదం కోసం ప్రతి గంట అదనంగా స్క్రీన్ చూడటం వల్ల 6 నుంచి 10 ఏళ్ల పిల్లల్లో కార్డియోమెటబాలిక్ రిస్క్ 0.08 పాయింట్లు, 18 ఏళ్ల యువతలో 0.13 పాయింట్లు పెరుగుతున్నట్లు కనుగొన్నారు. ముఖ్యంగా, తక్కువ సమయం నిద్రపోయే లేదా ఆలస్యంగా నిద్రపోయే పిల్లలలో ఈ ప్రమాదం మరింత బలంగా కనిపించింది. స్క్రీన్ టైమ్ వల్ల కలిగే నష్టంలో దాదాపు 12 శాతం నష్టాన్ని సరైన నిద్ర భర్తీ చేయగలదని, అంటే మంచి నిద్ర కొంతవరకు రక్షణ కవచంలా పనిచేస్తుందని పరిశోధకులు గుర్తించారు.ఈ పరిశోధన డెన్మార్క్‌లో జరిగినప్పటికీ, దీని ఫలితాలు భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుటుంబాలకు వర్తిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 2020 తర్వాత ఆన్‌లైన్ క్లాసుల కారణంగా భారతీయ పిల్లల్లో స్మార్ట్‌ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. చిన్న వయసులోనే ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత వంటి సమస్యలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో, ఈ అధ్యయనం తల్లిదండ్రులకు ఒక మేల్కొలుపు లాంటిది. పిల్లల స్క్రీన్ సమయాన్ని తగ్గించి, వారికి మంచి నిద్ర, శారీరక శ్రమ అందేలా చూడటం ద్వారా వారి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa