తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సమయం దగ్గర పడుతోంది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకూ తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ పాలకమండలి మంగళవారం చర్చించింది. అన్నమయ్య భవన్‌లో జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించారు.ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు కలిసి శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్ లెట్ విడుదల చేశారు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకూ తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వరకు జరుగనున్నాయి. సెప్టెంబర్ 23న అంకురార్పణం, సెప్టెంబర్ 24వ తేదీ ధ్వజారోహణం, సెప్టెంబర్ 28న గరుడ వాహన సేవ, అక్టోబర్ 2న చక్రస్నానం నిర్వహిస్తారు.
మరోవైపు టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసిన అనంతరం... సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వివరించారు. బ్రహ్మోత్సవాలను ఘనంగా, పకడ్బందీగా నిర్వహిస్తామని వెల్లడించారు. ధ్వజారోహణం రోజున ముఖ్యమంత్రి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని.. సెప్టెంబర్ 25న సీఎం పిఏసీ-5 ప్రారంభిస్తారని వివరించారు. మరోవైపు బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే నేపథ్యంలో.. తొలిసారిగా ఇస్రో సేవలు ఉపయోగించుకోనున్నట్లు టీటీడీ ఛైర్మన్ తెలిపారు. ఇస్రో సౌజన్యంతో క్రౌడ్ మేనేజ్‌మెంట్ మానిటరింగ్ చేయనున్నట్లు వివరించారు. శాటిలైట్ ఆధారంగా భక్తుల సంఖ్యను గణించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకూ దివ్యాంగులు, వయోవృద్ధులు, ఎన్.ఆర్.ఐ, చిన్నపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది.వార్షిక బ్రహ్మోత్సవాలలో సిఫార్సు లేఖలు రద్దు చేశామని, ప్రోటోకాల్ ప్రముఖులకే వీఐపీ బ్రేక్ దర్శనం ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది. బ్రహ్మోత్సవాల కోసం 8 లక్షల లడ్డులు బఫర్ స్టాక్‌గా ఉంచినట్లు టీటీడీ ఛైర్మన్ తెలిపారు. బ్రహ్మోత్సవాలలో ప్రధానమైన గరుడ సేవ రోజు 4 లక్షల మంది భక్తులు తిరుమలకు వస్తారని అంచనా వేస్తోంది టీటీడీ. ఈ నేపథ్యంలో భద్రతాపరంగా, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని పాలకమండలి భేటీలో నిర్ణయించారు.
సెప్టెంబర్ 28న గరుడ సేవ సందర్భంగా.. 27వ తేదీ రాత్రి 9 నుంచి 29వ తేదీ సాయంత్రం 6 వరకు తిరుమలకు ద్విచక్ర వాహనాల రాకపోకలను రద్దు చేశారు. గరుడ సేవ రోజున తిరుమల ఘాట్ రోడ్లు, నడక దారులు 24 గంటలు తెరిచి ఉంచాలని నిర్ణయించారు. ఆ రోజున తిరుమలకు వచ్చే భక్తులకు మజ్జిగ పంపిణీ చేయాలని నిర్ణయించారు. అలాగే బ్రహ్మోత్సవాలపై ప్రత్యేక వీడియో చిత్రీకరణను బాంబే ఏజెన్సీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బ్రహ్మోత్సవాలలో చిన్న పిల్లలు తప్పిపోకుండా జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
మరోవైపు కర్ణాటకలోని బెళగావిలో ఉన్న కొలికొప్ప గ్రామంలో టీటీడీ శ్రీవాణి ట్రస్టు నిధులతో ఏడు ఎకరాల్లో శ్రీవారి ఆలయాన్ని నిర్మించే ప్రతిపాదనలకు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది. గుంటూరు జిల్లా తుళ్లూరులో 7.2 కోట్లతో శ్రీవారి ఆలయం అభివృద్ధి చేసే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అన్నమయ్య జిల్లాలో పట్టాబిరామ ఆలయం అభివృద్ధికి రూ.5.73 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి పుష్కరిణి పునః నిర్మాణానికి రూ.1.50 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారికి దాతలు సమర్పించిన 89 లక్షల విలువైన భూమిని స్వీకరించేందుకు ఆమోదం తెలిపింది.
మరోవైపు టీటీడీని అప్రతిష్ట పాలు చేసేలా వ్యవహరించే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు. పాలకమండలి సమావేశంలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. మొదటి విడతలో దళితవాడల్లో వేయి శ్రీవారి ఆలయాలు నిర్మించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa