ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆన్‌లైన్‌ గేమ్‌లో రూ.13 లక్షలు పోగొట్టిన ఆరో తరగతి బాలుడు.. చివరికి ఆత్మహత్య

Crime |  Suryaa Desk  | Published : Tue, Sep 16, 2025, 07:49 PM

ఆన్‌లైన్ గేమ్స్ ఆడి.. అందులో డబ్బులు పోగొట్టుకుని.. ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ.. ఇలాంటి ఘటనలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు. చిన్నా, పెద్దా, ముసలి తేడా లేకుండా చాలా మంది ఈ ఆన్‌లైన్ గేమ్స్ బారిన పడి.. ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇక ఆన్‌లైన్ గేమ్స్‌ ఆడుతూ.. అకౌంట్లలో ఉన్న రూ.లక్షలు, రూ.కోట్లు ఖాళీ చేసుకుంటున్నారు. కష్టపడి ఏళ్లకేళ్లు రూపాయి రూపాయి పోగేసి.. చివరికి ఆన్‌లైన్ గేమ్స్‌కు తగలబెడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రూ.13 లక్షలు పోగొట్టుకున్న ఓ 6వ తరగతి బాలుడు.. బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే తమ కుమారుడు రూ.13 లక్షలను ఆన్‌లైన్ గేమ్స్‌లో పోగొట్టిన విషయం తెలిసినా తల్లిదండ్రులు ఏమీ అనకపోగా.. భయపడకుండా ధైర్యం చెప్పారు. అయినప్పటికీ ఆ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.


ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మోహన్‌లాల్‌గంజ్‌ ప్రాంతంలో ఉన్న బీఐపీఎస్ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్న 12 ఏళ్ల యశ్ కుమార్.. ఆత్మహత్య చేసుకున్నాడు. యశ్ కుమార్ తండ్రి సురేష్ కుమార్ యాదవ్.. ఒక పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. 2 ఏళ్ల క్రితం తమ కుటుంబానికి చెందిన కొంత భూమిని అమ్మగా వచ్చిన డబ్బులో దాదాపు రూ.13 లక్షలను బ్యాంక్ అకౌంట్‌లో జమ చేశారు.


ఈ క్రమంలోనే ఇటీవల బ్యాంకుకు వెళ్లిన సురేష్ కుమార్ యాదవ్.. బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్‌ను అప్‌డేట్ చేయించాడు. అందులో డబ్బులు మొత్తం ఖాళీ కావడం చూసి అవాక్కయ్యాడు. వెంటనే బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చి.. ఏం జరిగిందని ఎంక్వైరీ చేయగా.. రూ.13 లక్షలు ఆన్‌లైన్ గేమ్ ఆడినందుకు పలు ట్రాన్సాక్షన్ల ద్వారా ఖర్చు చేసినట్లు వెల్లడించారు. దీంతో తమకు ఉన్న ఒకే ఒక్క కొడుకు యశ్ కుమార్‌పై సురేష్ కుమార్ యాదవ్‌కు అనుమానం వచ్చి అడగ్గా.. తనకేమీ తెలియదని ఆ బాలుడు మొదట చెప్పలేదు.


అయితే ఆ తర్వాత.. అసలు విషయం చెప్పాడు. తాను ఫోన్‌లో ఫ్రీ ఫైర్ అనే గేమ్‌ ఆడానని.. అందులో ఈ డబ్బు అంతా పోగొట్టుకున్నట్లు వెల్లడించాడు. అది తెలిసి అతని తల్లిదండ్రులు షాక్ అయ్యారు. అయితే డబ్బులు పోగొట్టినందుకు యశ్ కుమార్‌ను అతడి తండ్రి సురేష్ కుమార్ ఏమీ అనలేదు. పైగా.. భయంతో ఉన్న కుమారుడికి ధైర్యం చెప్పాడు. ఇక యశ్ కుమార్ ట్యూషన్ టీచర్ కూడా అతడికి ధైర్యం చెప్పారు.


ఈ ఘటన జరిగిన తర్వాత యశ్ కుమార్.. తన గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. అయితే ఎంతకూ యశ్ కుమార్ గది నుంచి బయటికి రాకపోవడంతో.. కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా.. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించడంతో.. షాక్ అయ్యారు. హుటాహుటిన యశ్ కుమార్‌ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు. ఇక తమకు ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఇలా ప్రాణాలు తీసుకోవడంతో.. ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోయింది. కుమారుడి మరణ వార్త విని.. యశ్ కుమార్ తల్లి విమల స్పృహ తప్పి పడిపోయింది. అతని సోదరి గుంజన్ కన్నీరుమున్నీరుగా విలపించడం చూసి.. స్థానికులే కంటతడి పెట్టారు. యశ్ కుమార్ మృతికి సంతాపంగా.. బీఐపీఎస్ స్కూల్ యాజమాన్యం సెప్టెంబర్ 16వ తేదీన సెలవును ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa