ఆరోగ్యవంతమైన, సంపన్నమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడమే తమ ప్రభుత్వ ధ్యేయం" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ప్రజల ఆరోగ్యానికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యంగా మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం విశాఖపట్నంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి 'స్వస్త్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్' కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. అనంతరం జరిగిన సభలో చంద్రబాబు ప్రసంగించారు.మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం, తద్వారా రాష్ట్రం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. "మంచి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ చక్కెర, ఉప్పు, నూనె వాడకాలను తగ్గించుకోవాలి" అని ఆయన ప్రజలకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 'స్వస్త్ నారీ-సశక్త్ పరివార్' కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా 13,944 హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. "ఈ రోజు నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 15 రోజుల పాటు ఈ వైద్య శిబిరాలు కొనసాగుతాయి. హైబీపీ, షుగర్, ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్లతో పాటు టీబీ వంటి వ్యాధులకు ఉచితంగా పరీక్షలు చేస్తారు" అని ఆయన వివరించారు. గైనకాలజీ, ఈఎన్‌టీ, కళ్లు, డెర్మటాలజీ, సైకియాట్రీ వంటి స్పెషలిస్ట్ వైద్యుల సేవలు ఈ క్యాంపుల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.ప్రజారోగ్య పరిరక్షణ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. "ఈ ఏడాది ఆరోగ్య రంగం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.19,264 కోట్లు ఖర్చు చేస్తోంది. వైద్య ఖర్చులు పెరిగిపోయిన ఈ రోజుల్లో, పేదలకు అండగా నిలిచేందుకు యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను తీసుకొచ్చాం" అని అన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.2.5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తున్నట్లు ప్రకటించారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడే పేదల కోసం ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్టు ద్వారా రూ.25 లక్షల వరకు అయ్యే చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. టాటా, గేట్స్ ఫౌండేషన్ సహకారంతో 'ప్రాజెక్ట్ సంజీవని' ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.మహిళల సంక్షేమానికి, ఆర్థిక సాధికారతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. "తల్లికి వందనం, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల దీపం పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే స్త్రీ శక్తి పథకాలను అమలు చేస్తున్నాం. డ్వాక్రా, మెప్మా సంఘాల ద్వారా మహిళల ఆర్థిక స్థితిగతులను మార్చాం" అని ఆయన పేర్కొన్నారు. డ్వాక్రా మహిళల పొదుపు రూ.20 వేల కోట్లు దాటిందని, వారి రుణాల చెల్లింపులో క్రమశిక్షణ అద్భుతమని ప్రశంసించారు. లక్ష మంది మహిళలను లక్షాధికారులుగా చేయడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో హక్కు కల్పిస్తే, ప్రధాని మోదీ చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని గుర్తుచేశారు.ఈ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజున జరగడం సంతోషంగా ఉందని చంద్రబాబు అన్నారు. "పేదల అభ్యున్నతి, మహిళల ఆరోగ్యంపై ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఆయన సుదీర్ఘకాలం ప్రధానిగా దేశానికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని తెలిపారు. మోదీ నాయకత్వంలో 11 ఏళ్లలోనే భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, 2047 నాటికి నంబర్ వన్ స్థానానికి చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ దేశానికి సమర్థవంతమైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు.విశాఖ నగర ప్రజల స్ఫూర్తిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. "హుద్‌హుద్ తుఫాను సమయంలో విశాఖ వాసులు చూపిన చొరవ, సేవాభావాన్ని ఎప్పటికీ మరువలేను. విశాఖ దేశంలోనే అత్యుత్తమ నగరం, మహిళలకు అత్యంత సురక్షితమైన ప్రాంతం" అని ఆయన అన్నారు. త్వరలోనే నగరానికి గూగుల్ సంస్థ రాబోతోందని, భవిష్యత్తులో విశాఖను దేశంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa