ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూపీలో ‘ఐ లవ్ మహమ్మద్’ లాఠీ‌ఛార్జ్

national |  Suryaa Desk  | Published : Fri, Sep 26, 2025, 08:04 PM

‘ ఐ లవ్ మహమ్మద్ ’ ప్లకార్డుల ప్రదర్శన ఉత్తర్ ప్రదేశ్‌లో ఘర్షణలకు దారితీసింది. బరేలీలో పోలీసులపై రాళ్లు రువ్విన యువకులను చెదరగొట్టడానికి లాఠీఛార్జ్ చేశారు. శుక్రవారం నమాజ్ తర్వాత కొంతమంది నిరసనకారులు.. ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్న ఉత్తరప్రదేశ్ పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టడానికి లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. ‘ఐ లవ్ మహమ్మద్’ అనే నినాదం కాన్పూర్‌లో మొదలైంది. మిలాద్ ఉన్ నబీ సమయంలో బారావఫాత్ ఊరేగింపు సందర్భంగా.. కొంతమంది ముస్లింలు యువకులు ‘ఐ లవ్ మహమ్మద్’ అనే ప్లకార్డులను ప్రదర్శించారు.


దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన కొన్ని హిందూ సంస్థలు.. ఇది అనవసరమైన రెచ్చగొట్టే చర్యలను ప్రేరేపిస్తుందని ఆరోపించాయి. దీనికి కౌంటర్‌గా ‘ఐ లవ్ మహాదేవ్’ అనే నినాదం ఎత్తుకున్నారు. తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడంతో పోలీసులు కొంతమందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి.. పోస్టర్లను తొలగించారు. దీంతో బరేలీలో ఉన్న మౌలానా తౌఖీర్ రజా వంటి మత పెద్దలు పోలీసుల తీరును ఖండిస్తూ పెద్దఎత్తున నిరసనలకు పిలుపునిచ్చారు. శుక్రవారం బరేలీలోని ఇస్లామియా గ్రౌండ్‌లో ఐ లవ్ ముహమ్మద్ పోస్టర్ వివాదంపై ఆయన ధర్నాకు పిలుపునిచ్చారు.


ఈ క్రమంలో శుక్రవారం నిరసనకారులు ఐ లవ్ మహమ్మద్ అనే ప్లకార్డులతో రెండు చోట్ల.. దర్గా అల్ హజ్రత్ వద్ద.. అలాగే నిరసనలకు పిలుపునిచ్చిన ఐఎంసీ చీఫ్ మౌలానా తౌఖీర్ రజా ఖాన్ ఇంటి వద్ద గుమిగూడారు. అప్పటికే పోలీసులు ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. ముందుస్తు చర్యగా పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సమయంలోనే కొంతమంది అల్లరి మూకలు వీధుల్లోకి వచ్చి పోలీసులపై రాళ్లు రువ్వారు. అంతటితో ఆగకుండా పెద్ద ఎత్తున నినాదాలు చేశారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే వారిపై లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చిందని అన్నారు.


మౌలానా తౌఖీర్ రజా శుక్రవారం ఇస్లామియా గ్రౌండ్‌లో ఐ లవ్ ముహమ్మద్ పోస్టర్ వివాదంపై ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలియగానే.. అధికారులు బరేలీలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. జిల్లా మేజిస్ట్రేట్ అవినాష్ సింగ్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనురాగ్ ఆర్య, పోలీసులు, పీఏసీ, పారామిలిటరీ బలగాలతో కలిసి ఈ మార్చ్‌ను నిర్వహించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే ఏ ప్రయత్నాన్ని సహించబోమని గట్టి సందేశం ఇచ్చారు. కానీ, కొంతమంది నిరసనకారులు పోలీసులపై తిరగబడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.


అంతకుముందు తౌఖీర్ రజా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రవక్తకు వ్యతిరేకంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంఘటనలను ప్రస్తావించారు. ఇక, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సైతం ఈ అంశంపై స్పందించారు. ఎవరో ‘ఐ లవ్ యూ’ అంటే అందులో తప్పేమి ఉందని ఆయన ప్రశ్నించారు. ‘లవ్’ అని రాయడం వల్ల సమస్య ఉందా? అని నిలదీశారు. దీని ద్వారా ముస్లిం దేశాలకు ఎలాంటి సందేశం పంపాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఎవరి విశ్వాసాలు వారివని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa