ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కల్తీ మద్యం తయారీదారులపై ఉక్కుపాదం మోపాలని సీఎం చంద్రబాబు ఆదేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 08, 2025, 09:02 PM

రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపడంతో పాటు, ఇదే అంశాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా జరుగుతున్న రాజకీయ దుష్ప్రచారాన్ని కూడా అంతే తీవ్రంగా అణిచివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులను, అధికారులను ఆదేశించారు. ఉన్నతాధికారులు, మంత్రులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన ఈ అంశంపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. కల్తీ మద్యం ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని, అదే సమయంలో సహజ మరణాలను కూడా కల్తీ మద్యం మరణాలుగా చిత్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలనుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.కొన్ని రాజకీయ పక్షాలు రాష్ట్రవ్యాప్తంగా కల్తీ మద్యం ఏరులై పారుతోందంటూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. "ప్రతి మూడు మద్యం బాటిళ్లలో ఒకటి కల్తీదేనని, కల్తీ మద్యం తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఒక పథకం ప్రకారం ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. ఇది పూర్తిగా రాజకీయ కుట్ర" అని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి ఆరోపణలు వచ్చిన ప్రతిచోటా సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. "మద్యం మరణం అని ప్రచారం చేసిన ప్రతి కేసులోనూ అవసరమైతే పోస్టుమార్టం నిర్వహించి, శాస్త్రీయ ఆధారాలతో మరణానికి గల అసలు కారణాలను నిగ్గు తేల్చండి. వాస్తవాలను ప్రజల ముందు ఉంచండి" అని సూచించారు. రాజకీయ దురుద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తేలితే, వారు మీడియా అయినా, సోషల్ మీడియా అయినా సరే, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గట్టిగా హెచ్చరించారు. ప్రభుత్వం సైలెంట్‌గా చూస్తూ ఊరుకోదని ఆయన స్పష్టం చేశారు.గత 15 నెలల్లో పటిష్టమైన చర్యల ద్వారా పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా వచ్చే నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను విజయవంతంగా అరికట్టామని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో పనిచేసి రాష్ట్రంలో కల్తీ మద్యం అనేదే లేకుండా చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేసి రాష్ట్రంలో ఒక్క కల్తీ మద్యం తయారీ కేంద్రం కూడా ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా అధికారులు అన్నమయ్య, ఎన్టీఆర్ జిల్లాల్లో చేపట్టిన చర్యలను ముఖ్యమంత్రికి వివరించారు.అన్నమయ్య జిల్లా ములకలచెరువులో వెలుగు చూసిన కల్తీ మద్యం కేసులో ఇప్పటివరకు 21 మందిని నిందితులుగా గుర్తించామని, వారిలో 12 మందిని అరెస్టు చేశామని అధికారులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్ధన్‌రావు కార్యకలాపాలపై లోతైన దర్యాప్తు చేస్తున్నామన్నారు. అతనిచ్చిన సమాచారంతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని అతనికి చెందిన వ్యాపార సముదాయాల్లో తనిఖీలు నిర్వహించగా, కిరాణా షాపు వెనుక భారీగా కల్తీ మద్యం నిల్వలను గుర్తించినట్లు వివరించారు. సుమారు 15 ఏళ్లుగా మద్యం వ్యాపారం చేస్తున్న జనార్ధన్‌రావు, తన సోదరుడు జగన్ మోహన్ రావుతో కలిసి అధిక లాభాల కోసం ఈ కల్తీ దందాను నిర్వహిస్తున్నట్లు తేలిందన్నారు. ఇబ్రహీంపట్నం కేసులో 12 మంది నిందితులను గుర్తించి, ముగ్గురిని అరెస్టు చేశామని, నలుగురిని పీటీ వారెంట్‌పై విచారిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు.ఈ సమావేశంలో మంత్రులు కొల్లు రవీంద్ర, నారా లోకేశ్ ప్రత్యక్షంగా పాల్గొనగా, హోంమంత్రితో సహా పలువురు మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ప్రతిపక్ష వైసీపీకి ఎలాంటి అంశాలు దొరకడం లేదన్నారు. "ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నాం. దీంతో విమర్శలకు తావులేక, తమ పాత సిద్ధాంతమైన ఫేక్ ప్రచారాన్ని నమ్ముకున్నారు. 2019లో వివేకా హత్య సమయంలో వారు ఆడిన శవ రాజకీయాలను మర్చిపోవద్దు. వారి కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాల్సిన బాధ్యత మంత్రులు, ప్రజాప్రతినిధులపై ఉంది" అని ఆయన దిశానిర్దేశం చేశారు. వాస్తవాలను ప్రజలకు వివరించి, వారిలో ధైర్యం నింపాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa