ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించిందని ఆయన ప్రకటించారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన నేపథ్యంలో, బస్సుల ఫిట్‌నెస్, ఇతర భద్రతా నిబంధనలను పాటించకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఘటనకు దారి తీసిన కారణాలపై లోతుగా విచారణ జరపాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ప్రైవేట్ బస్సుల యజమానులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. బస్సుల ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్ వంటి కీలక అంశాల్లో నిబంధనలు పాటించకుంటే ఉపేక్షించేది లేదని, తీవ్ర చర్యలు తప్పవని అన్నారు. బస్సులను తనిఖీ చేస్తే, 'వేధింపులు' అంటూ ట్రావెల్స్ యజమానులు ఆరోపిస్తున్నారని, కానీ, ఆ తనిఖీలు వేధింపులు కాదని, అవి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలని మంత్రి తేల్చి చెప్పారు. తనిఖీలను వేధింపులుగా భావించి నిర్లక్ష్యం వహిస్తే ఇలాంటి దురదృష్టకర ప్రమాదాలు జరుగుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పొన్నం తెలిపారు. ముఖ్యంగా ప్రైవేట్ బస్సుల ఓవర్ స్పీడ్ నియంత్రణకు చర్యలు చేపడతామని, దీనిపై ప్రత్యేకంగా ఒక కమిటీని వేయనున్నట్లు ప్రకటించారు. ప్రయాణికుల భద్రతకు భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యతని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ఉద్ఘాటించారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులకు పునరుద్ఘాటించారు.
ఈ దుర్ఘటన నేపథ్యంలో, ప్రమాదాల నివారణకు ఉమ్మడి కార్యాచరణ రూపొందించేందుకు త్వరలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, కమిషనర్లతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. వివిధ రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే బస్సుల్లో భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడం, వేగ పరిమితి నియంత్రణ, తనిఖీలను కచ్చితంగా అమలు చేయడం వంటి అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటామని ఆయన వివరించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa