అడవుల ఆక్రమణలకు పాల్పడేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కృష్ణా జిల్లా కొండపావులూరులోని NDMA ఆవరణలో జరిగిన రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల వర్క్ షాపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడవుల సంరక్షణ, భవిష్యత్తు లక్ష్యాలపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అడవులు జాతీయ ఆస్తి అని, వాటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని గుర్తు చేశారు. అడవుల రక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని.. అడవులను రక్షించుకునే విషయంలో రాజకీయాలకు, రాజీకి తావులేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అడవులు జాతి సంపదగా, ప్రతి అంగుళం అమూల్యమని పేర్కొన్నారు. అటవీ శాఖ క్షేత్ర స్థాయి సిబ్బంది, అధికారులు కూడా అటవీ భూములను రక్షించే విషయంలో పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
మరోవైపు వైసీపీ హయాంలో అటవీ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తే తన సొంత ఇలాకాలోని అటవీ భూములను ఇష్టానుసారం ఆక్రమించుకున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అంత జరుగుతున్నా కూడా ఆరోజు అధికారులు ఎందుకు స్పందించలేదో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. అలాంటి తప్పిదాలు కూటమి ప్రభుత్వంలో జరగడానికి వీల్లేదని., పార్టీలు, వ్యక్తులకు అతీతంగా అటవీ భూమి అంగుళం కబ్జా అయినా వేగంగా స్పందించాల్సిన బాధ్యత అటవీ అధికారులకు ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అటవీ శాఖలో సిబ్బంది కొరత విషయాన్ని కేబినెట్ ముందు ఉంచామన్న పవన్ కళ్యాణ్.. సిబ్బంది నియామకం వ్యవహారంలో పూర్తి స్థాయి పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి సిఫార్సులకు తావివ్వవద్దని సూచించరాు.
అటవీ సిబ్బంది భద్రత పట్ల కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి స్పష్టతతో ఉందన్న పవన్ కళ్యాణ్.. విధి నిర్వహణలోని అధికారులను ఇబ్బందిపెట్టినా, దాడులకు పాల్పడినా అది ఏ స్థాయి వ్యక్తులైనా వారిని ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధి నిర్వహణలో అటవీ శాఖ సిబ్బందికి ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వ్యక్తిగతంగా తనను కలిసి చెప్పాలని సూచించారు.
శ్రీశైలం ఘటన తన దృష్టికి వచ్చిన వెంటనే నిజానిజాలు తెలుసుకున్నానని.. సిబ్బందికి తగిన న్యాయం జరిగేలా చూశానని పవన్ కళ్యాణ్ అన్నారు. విధి నిర్వహణ విషయంలో ఎలాంటి భయాలకు తావివ్వవద్దని సూచించారు. రాష్ట్రంలో అడవుల శాతంపై సమగ్ర సర్వే చేసి ఇతర శాఖలను సమన్వయం చేసుకుని అటవీ భూములను స్వాధీనం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించాలని పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa