దేశంలో పెట్టుబడి మోసాలు (Investment Scams) వేల మంది అమాయక ప్రజలను నిండా ముంచుతున్నాయి. గత ఆరు నెలల్లోనే 30 వేలకు పైగా బాధితులు రూ. 1,500 కోట్లకు పైగా నష్టపోయినట్లు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) వెల్లడించింది. అధిక రాబడి ఆశ చూపి, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సైబర్ నేరగాళ్లు సాగిస్తున్న ఈ మోసాలు పట్టణాల్లోని ఉన్నత వర్గాలనే ప్రధానంగా లక్ష్యంగా చేసుకుంటున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
ఈ భారీ సైబర్ నేరాల సుడిగుండంలో చిక్కుకున్న బాధితుల్లో మధ్య వయస్కులే అధికంగా ఉన్నారు. ముఖ్యంగా 30 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారే 76% మంది ఉన్నారు. ఈ వయస్సులోని వ్యక్తులు మెరుగైన ఆర్థిక భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపడం, అలాగే వారి వద్ద డిస్పోజబుల్ ఆదాయం ఉండటమే నేరగాళ్లకు అనుకూలంగా మారుతోంది. ఈ బాధితుల్లో 65% కేసులు ఢిల్లీ-ఎన్‌సిఆర్, బెంగళూరు, హైదరాబాద్ వంటి అగ్రశ్రేణి మెట్రో నగరాల్లోనే నమోదవడం ఈ ట్రెండ్‌ను నొక్కి చెబుతోంది.
నష్టపోయిన మొత్తం పరంగా పరిశీలిస్తే, బెంగళూరు నగరం అగ్రస్థానంలో ఉంది. మొత్తం నష్టంలో 26.38% వాటా ఈ నగరానిదే. అయితే, ఒక్కో బాధితుడు సగటున నష్టపోయిన మొత్తం విషయంలో ఢిల్లీ-NCR అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ బాధితులు సగటున ఒక్కొక్కరు రూ. 8 లక్షలు కోల్పోయినట్లు ఐ4సీ డేటా తెలుపుతోంది. ఈ గణాంకాలు.. ఈ స్కామ్‌ల వెనుక ఉన్న మోసాలు అత్యంత అధునాతనమైనవని, బాధితుల వ్యక్తిగత ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని సూచిస్తున్నాయి.
ఈ పెట్టుబడి స్కామ్‌ల ప్రభావాన్ని తగ్గించడానికి సైబర్ నేరాల సమన్వయ కేంద్రం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉంది. సామాన్యులు, ముఖ్యంగా మధ్య వయస్కులు ఆన్‌లైన్‌లో వచ్చే అనధికారిక, అధిక లాభాల ఆశ చూపే పెట్టుబడి పథకాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మెసేజింగ్ యాప్‌లు, సోషల్ మీడియా ద్వారా వచ్చే తప్పుడు ఆఫర్లను గుడ్డిగా నమ్మకుండా, ధృవీకరించబడిన మార్గాల ద్వారానే పెట్టుబడులు పెట్టాలని అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నారు. మోసపోయిన వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa