'వన్ విజన్-వన్ డైరెక్షన్' ప్రభుత్వ విధానమని, దీనికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం చేశారు. స్వర్ణాంధ్ర-2047 విజన్ దిశగా ప్రభుత్వ యంత్రాంగం పని చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాలు విజన్ యూనిట్లుగా పనిచేయాలని నిర్దేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాకులో డేటా ఆధారిత పాలనపై ముఖ్యమంత్రి నేతృత్వంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌ఓడీలు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఈ సదస్సుకు హాజరయ్యారు.డేటా ఆధారంగా పాలన ఏ విధంగా చేపట్టాలి సత్వర నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవచ్చు డేటా ఆధారిత గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు ఏ విధంగా అందించవచ్చనే అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని పౌరులకు సుపరిపాలన అందించాలి. అదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. దానికి అనుగుణంగానే విజన్ ప్రణాళికలను రూపొందించాం. 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని కోరుతున్నాను. నెలవారీ, త్రైమాసికాల వారీగా లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఫలితాలను సాధించాలి. నిర్ధిష్ట ప్రమాణాలకు అనుగుణంగానే ప్రభుత్వం పౌరసేవలు అందించాల్సి ఉంది. ప్రతీ నియోజకవర్గానికీ ఓ సీనియర్ అధికారి నేతృత్వంలో టాస్క్‌ఫోర్సు ఏర్పాటు చేసి విజన్ ప్లాన్ అమలు చేస్తాం. ఆర్టీజీఎస్ ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఆయా శాఖలకు అప్పగిస్తున్నాం. దానికి అనుగుణంగానే నిర్ణయాలు వేగంగా తీసుకోవాల్సి ఉంటుంది.ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే అధికారులు, ప్రజా ప్రతినిధులకు ప్రాధాన్యత కావాలి. గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్‌గా మార్చుకుని సమర్ధవంతంగా ఆ విభాగాన్ని వినియోగించుకోవాలి. ఇటీవల వచ్చిన తుఫాన్ సమయంలో టెక్నాలజీ వినియోగించుకుని అంతా కలిసి కట్టుగా పని చేశాం. రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించగలిగాం. డేటా ఆధారిత పాలన అనేది ఇప్పుడు అత్యంత కీలకమైన అంశంగా మారింది. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని చక్కదిద్దుతూ ఉన్న సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం"అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు."ప్రస్తుతం రియల్ టైమ్ గవర్నెన్స్ కాలం నడుస్తోంది. సిటిజన్ డేటా అంతా క్రోడీకరించాం. అంగన్‌వాడీల స్థాయి నుంచే విద్యార్ధుల డేటా అనుసంధానం కావాలి. అవేర్ ద్వారా విస్తృతమైన డేటాను సమన్వయం చేసుకుని వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు డేటా లేక్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. దీని ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారం ఒక్క చోటే క్రోడీకరించి త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. ఈ డేటా ద్వారా రియల్ టైమ్‌లోనే విశ్లేషించి తక్షణ నిర్ణయాలు తీసుకునేందుకు ఆస్కారం ఉంది. ముందుగా అంచనాలు వేయడం, దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం, తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించండం అనేది సాంకేతికత ద్వారా సాధ్యం అవుతోంది. ప్రజల సంక్షేమం కోసం, పాలన కోసం భారీస్థాయిలో బడ్జెట్ వ్యయం చేస్తున్నాం. నిధుల వ్యయం సమర్ధంగా జరగాలి.ప్రస్తుతం ఇ-ఫైల్స్ కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయి. అయితే ఎంత వేగంగా నిర్ణయం తీసుకుంటున్నారన్నదే ప్రస్తుతం ఉత్పన్నం అవుతున్న ప్రశ్న. గతంలో ఒక్క చదువుకే కులం, స్థానికత, ఆదాయం ఇలా వేర్వేరు ధృవపత్రాలు 10 రోజులు ఆఫీసుల చుట్టూ తిరిగి తీసుకోవాల్సి వచ్చేది. ఈ పరిస్థితి అంతా మారిపోవాలి. కేంద్రం తీసుకొచ్చిన డిజి లాకర్‌ను సమర్ధంగా వినియోగించాలి. అందరూ అన్ని శాఖలలోని సమాచారాన్ని తెలుసుకుని దానిని గుర్తించి పనిచేయాలి. ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్‌లో అందిస్తున్నప్పుడు మళ్లీ ప్రజల్ని కార్యాలయాలకు రప్పించటం ఎందుకన్నది ఆలోచించాలి. దేవాదాయశాఖ అందిస్తున్న సేవల విషయంలో భక్తులు అంతా క్షేత్రస్థాయికి వస్తారు. రెవెన్యూ సహా ఇతర శాఖల సేవలు వీలైనన్ని ఆన్ లైన్ లేదా, వాట్సప్ గవర్నెన్స్ ద్వారానే అందాలి. ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరిగే పరిస్థితి ఉండకూడదు. అన్ని జిల్లాల్లో ఆర్టీజీఎస్ కేంద్రాలు ఏర్పాటు అవుతాయి.ఏఐ సాయంతో పాత సమాచారాన్ని, ప్రస్తుతం ఉత్పన్నం అయ్యే సమాచారాన్ని సరిచూసుకోవాలి. ప్రజలకు అందే ప్రతీ సేవలోనూ ప్రమాణాల్ని నెలకొల్పాల్సి ఉంది. అలాగే ప్రజల నుంచి అందే ఫిర్యాదుల విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుతున్నా. ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు సరిగ్గా వ్యవహరించాలి. ఆర్దికేతర, చట్టపరమైన ఫిర్యాదుల విషయంలో ఆలస్యం జరగటం సరికాదు. ఈ పరిస్థితి మారాలి. అలాగే జరుగుతున్న పరిణామాలు ఆధారంగా ఎప్పటికప్పుడు అలెర్ట్ అవ్వాలి. జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదాలు జరిగినప్పుడు వాటికి గల కారణాలను విశ్లేషించి భవిష్యత్తులో అలాంటివి జరగ్గకుండా చూసుకోవాలి. ఇటీవల జరిగిన బస్సు ప్రమాదాల వల్ల చాలా ప్రాణాలు పోయాయి. కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఒక సంఘటన తర్వాత ఆయా తప్పులు దిద్దుకోవాల్సి ఉంది. ఆ మేరకు ప్రామాణికాలు రూపొందించుకుని అటువంటి తప్పిదాలు మళ్లీ జరగ్గకుండా చూసుకోవాలి. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా ఘటనలు జరక్కుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంది" అని ముఖ్యమంత్రి అన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa