బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని భారత రాయబార కార్యాలయంపై ర్యాడికల్ గ్రూప్ దాడికి యత్నించడం కలకలం రేపుతోంది. భద్రతా కారణాల రీత్యా డిసెంబరు 17న బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఢాకాలోని రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టు భారత ప్రకటించింది. డిసెంబరు 17న వీసా కోసం అపాయింట్‌మెంట్ ఉన్న ఉన్న దరఖాస్తుదారులకు వేరే తేదీకి రీషెడ్యూల్ చేయబోమని ఆ ప్రకటనలో పేర్కొంది. భారత వ్యతిరేక ర్యాలీ చేపట్టిన ర్యాడికల్ గ్రూప్.. ఢాకాలోని ఎంబసీని టార్గెట్ చేసింది. లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులను బంగ్లా భద్రతా బలగాలు అడ్డుకున్నాయి.
ఢాకాలోని ఎంబసీకి బెదిరింపులు, బంగ్లా రాజకీయ నాయకుల విద్వేషపూరిత ప్రకటనలపై భారత్ ఇప్పటికే స్పందించి, న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబారికి సమన్లు జారీచేసిన విషయం తెలిసిందే. భారత్ నిరసన తెలియజేసిన కొద్ది గంటల్లోనే ఢాకాలోని ఎంబసీపై దాడికి యత్నించడం గమనార్మం. గతేడాది జులై- ఆగస్టులో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ యువత చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారి చివరకు ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి, భారత్‌కు పారిపోయివచ్చారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు క్రమంగా క్షీణిస్తున్నాయి. ఇది భారత్, బంగ్లా మధ్య ఉద్రిక్తతలకు దారితీసి, వాణిజ్యంపై కూడా ప్రభావం చూపుతోంది.
భారత కేబుల్ టీవీ పరికరాలకు బంగ్లాదేశ్ కీలకమైన మార్కెట్. అయితే, వీసా పరిమితుల కారణంగా 26వ కేబుల్ టీవీ షోకు ఆ దేశం నుంచి హాజరయ్యే ప్రతినిధుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ‘‘సాధారణంగా ఈ ప్రదర్శనకు బంగ్లాదేశ్ నుంచి సుమారు 400 ప్రతినిధులు వస్తుంటారు. కానీ ఈసారి వివిధ కారణాల వల్ల వీసాలు దొరకడం పెద్ద సమస్యగా మారింది’” అని కేబుల్ టీవీ ఎక్విప్‌మెంట్ ట్రేడర్స్ అండ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఎగ్జిబిషన్ చైర్మన్ పవన్ జజోడియా తెలిపారు.
భారత హైకమిషన్‌ను పదేపదే కోరినప్పటికీ, కేవలం 60 మంది ప్రతినిధులకు మాత్రమే వీసాలు లభించాయని ఆయన చెప్పారు. ఈ పరిమిత భాగస్వామ్యం సరిహద్దు వాణిజ్య సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు. మరోవైపు, భారత్‌కు చెందిన మత్స్యకారుల పడవ ఎఫ్‌బీ పరామిత-2 బంగ్లాదేశ్ ప్రాదేశిక జలాల సరిహద్దుల సమీపంలో బంగ్లా పెట్రోలింగ్ నౌక ఢీకొట్టడంతో మునిగిపోయింది. ఈ ఘటనలో రాజ్‌దుల్ అలీ షేక్ అనే మత్స్యకారుడ్ని ఈటెలాంటి పదునైన ఆయుధంతో పొడిచి చంపారు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన 11 మంది మత్స్యకారులు ఈ దాడి గురించి వివరిస్తూ.. ఓడలో ఉన్న వారందరూ దాదాపు చనిపోయారని వివరించారు. వారు మంగళవారం నామ్‌ఖానాకు చేరుకోగా.. ఐదుగురు ఆచూకీ ఇంకా తెలియరాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa