పోలీస్ అకాడమీ అంటే అంతా అక్కడ పోలీసులే ఉంటారు. నిత్యం కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. దొంగలు కాదు కదా ఎవరూ అటు పక్క చూసేందుకు కూడా భయపడతారు. అలాంటి హై సెక్యూరిటీ ప్రాంతంలో భారీ దొంగతనం జరిగింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు గంధపు చెట్లను ఎత్తుకుపోయారు. ఆ చెట్ల వయసు 30 ఏళ్లకు పైనే ఉండగా.. వాటి విలువ రూ.లక్షల్లో ఉంటుందని అంచనా. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. కేరళ పోలీస్ అకాడమీలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు.. అక్కడ భద్రతలో డొల్లతనాన్ని బయటపెడుతోంది. దీంతో అక్కడి అధికారులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కేరళలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పోలీస్ అకాడమీ క్యాంపస్‌లోనే ఈ భారీ దొంగతనం జరగడంతో పోలీసులు ప్రస్తుతం అటవీ మార్గాలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలిస్తున్నారు. త్రిస్సూర్ జిల్లాలో ఉన్న ఈ క్యాంపస్ నుంచి సుమారు రూ. లక్షల విలువైన రెండు గంధపు చెట్లను దొంగలు ఎత్తుకెళ్లారు. 348 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పోలీస్ అకాడమీలో 24 గంటల పాటు సాయుధ పోలీసుల పహారా ఉంటుంది. నిత్యం వందలాది మంది పోలీసు అధికారులతోపాటు.. ట్రైనింగ్ పొందుతున్న వారు ఇక్కడ ఉంటారు. ఇంతటి భద్రత మధ్య దొంగలు చొరబడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
దొంగిలించిన రెండు చందనం చెట్లు సుమారు 30 ఏళ్లకు పైగా వయసున్నవని.. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.లక్షల్లో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఆ గంధపు చెట్లను సీనియర్ స్మగ్లర్లే చోరీ చేశారని.. వారు దొంగతనం చేసిన విధానం చూస్తుంటే తెలుస్తోందని పోలీసులు తెలిపారు. దొంగలు చెట్టు మొత్తాన్ని కాకుండా.. కేవలం అందులో అత్యంత ఖరీదైన హార్ట్‌వుడ్ ఉన్న మధ్య భాగాలను మాత్రమే చాకచక్యంగా కత్తిరించి తీసుకువెళ్లారని పేర్కొన్నారు. ఇది అనుభవజ్ఞులైన స్మగ్లర్ల పని అని పోలీసులు భావిస్తున్నారు.
ఈ గంధపు చెట్ల దొంగతనం డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ మధ్య జరిగి ఉండవచ్చని పోలీసులు చేపట్టిన ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పోలీస్ అకాడమీ క్యాంపస్‌లోని ఒక భాగం దట్టమైన అటవీ ప్రాంతంతో కలిసి ఉండటం వల్ల దొంగలు అక్కడి నుండి ప్రవేశించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడం కూడా వారికి కలిసొచ్చిందని పేర్కొంటున్నారు. ఈ ఘటనపై పోలీస్ అకాడమీ ఎస్టేట్ అధికారి సతీష్ టియు ఫిర్యాదు మేరకు వియ్యూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటన తర్వాత అకాడమీ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రత్యేక ఆదేశాన్ని జారీ చేసింది. రాత్రిపూట అకాడమీలో గస్తీని మరింత పెంచాలని.. బయటి వ్యక్తులపై కఠిన నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లోని నేరపూరిత అతిక్రమణ, ప్రభుత్వ ఆస్తి దొంగతనం కింద కేసు నమోదు చేశారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa