ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా కుటుంబంలో 8 మంది ఉంటే, నలుగురు కమ్మ వాళ్లే: అంబటి రాంబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 06:22 PM

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఇద్దరు అల్లుళ్లు కమ్మ వాళ్లేనని.. తన కుటుంబంలో ఎనిమిది మంది ఉంటే అందులో నలుగురు కమ్మ సామాజికవర్గానికి చెందిన వారేనని అంబటి రాంబాబు అన్నారు. అలాంటిది తాను కులం పేరుతో ఎందుకు దూషిస్తానని ప్రశ్నించారు. తాను కమ్మవారిని తిట్టినట్లు రిమాండ్ రిపోర్టులో రాశారని అంబటి రాంబాబు అన్నారు. ఈ నేపథ్యంలోనే తన కుటుంబం గురించి, తన అల్లుళ్ల సామాజికవర్గం గురించి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.


చంద్రబాబును ఉద్దేశపూర్వకంగా అనలేదు.. అంబటి రాంబాబు


వివిధ కేసులలో బెయిల్ లభించడంతో బుధవారం రోజున అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన తర్వాత అంబటి రాంబాబు.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జరిగిన పరిణామాలను వివరించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడిన అంబటి రాంబాబు.. కీలక వ్యాఖ్యలు చేశారు.


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి తాను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని అంబటి రాంబాబు మరోసారి స్పష్టం చేశారు. అవతలి వ్యక్తులు తన‌ను తిడుతున్నార‌నే క్షణికావేశంలో అలా మాట్లాడేశానని అన్నారు. అయినా కూడా.. ఈ వయసులో తాను అలా అనాల్సింది కాదని.. ఇందుకు పశ్చాత్తాపపడుతున్నానని అన్నారు. ప‌శ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని అంబటి రాంబాబు అన్నారు.


పెమ్మసాని సినిమా వ్యాఖ్యలకు అంబటి రాంబాబు కౌంటర్


మరోవైపు తాను జైళ్లో ఉన్నప్పుడు తనకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు కుట్ర చేశారని అంబటి రాంబాబు అన్నారు. దీని వెనుక వంశీ అనే వ్యక్తి హస్తం ఉందని అంబటి రాంబాబు ఆరోపణలు చేశారు. ఇక కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సినిమా చూపిస్తామంటూ చేసిన వ్యాఖ్యలకు కూడా.. రాంబాబు కౌంటర్ ఇచ్చారు. పెమ్మసాని చంద్రశేఖర్ 18 రోజులు సినిమా చూపించారన్న అంబటి రాంబాబు.. ఇంత‌పెద్ద సినిమాలో హీరో ఎవ‌రయ్యారని ప్రశ్నించారు. ఈ సినిమా తీసి మీరే విలన్లయ్యారంటూ సెటైర్లు వేశారు.


పవన్.. నీకూ, చంద్రబాబుకూ తేడా ఏంటి? అంబటి రాంబాబు


మరోవైపు అసహ్యంగా మాట్లాడినందుకు దాడులు జరుగుతున్నాయంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపైనా అంబటి స్పందించారు. అసహ్యంగా మాట్లాడితేనే దాడులు జరుగుతాయా అని ప్రశ్నించారు. మీరెప్పుడూ అసహ్యంగా మాట్లాడలేదా అంటూ పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ వైసీపీ వాళ్లకు చెప్పు పైకి తీసి చూపించలేదా అని ప్రశ్నించారు. అది కూడా జనసేనలో సభలో చూపించారని.. క్షణికావేశంలో చేసింది కాదన్నారు. అన్యాయం జరిగినప్పుడు అన్యాయం అని ప్రశ్నించలేకపోతే .. నీకూ, చంద్రబాబుకు ఏం తేడా ఉందంటూ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు గుప్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa