ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్కాపురం పట్టణంలో ప్రజావేదిక సభలో పాల్గొననున్న సీఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 24, 2026, 09:58 PM

మార్కాపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం పర్యటించనున్నారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు తర్వాత ఇదే ఆయన తొలి పర్యటన కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా, పశ్చిమ ప్రకాశం ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసే వెలిగొండ ప్రాజెక్టు అసంపూర్తి పనులను పూర్తి చేసే దిశగా కీలక ముందడుగు వేయనున్నారు. రూ.456 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఫీడర్ కెనాల్ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు.ముఖ్యమంత్రి పర్యటన వివరాల ప్రకారం, బుధవారం ఉదయం అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అమరావతి నుంచి బయలుదేరుతారు. 12:40 గంటలకు మార్కాపురం జిల్లా గంటావానిపాలెం చేరుకుని, 12:50 గంటలకు వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు భూమి పూజ చేసి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2:10 గంటలకు మార్కాపురం పట్టణానికి చేరుకుంటారు. 2:30 గంటలకు తర్లుపాడు రోడ్డులో ఏర్పాటు చేసిన 'ప్రజావేదిక' బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 5:20 గంటలకు తిరిగి అమరావతికి పయనమవుతారు.మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనేది ఆ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి, టీడీపీ ప్రభుత్వం జనవరిలో మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల చేసింది. మరోవైపు, గత వైసీపీ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టులో కీలకమైన కెనాల్స్, ఫీడర్ కెనాల్ లైనింగ్, రిటైనింగ్ వాల్, జంట సొరంగాల పనులు పూర్తి చేయకుండా, నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండానే ప్రాజెక్టును జాతికి అంకితం చేసినట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో, ప్రాజెక్టును పూర్తిస్థాయిలో పూర్తి చేసి ప్రజలకు సాగు, తాగునీరు అందించాలని ప్రస్తుత ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగానే ఫీడర్ కెనాల్ పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పర్యటనతో జిల్లా అభివృద్ధి, ప్రాజెక్టుల పూర్తిపై ప్రభుత్వం స్పష్టమైన భరోసా ఇవ్వనుందని స్థానికులు ఆశిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa