గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ కేసులో.. ఇటీవల కీలక తీర్పు వెలువడిన సంగతి తెలిసిందే. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు.. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సహా మొత్తం 23 మంది భారీ ఊరట కల్పిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో సీబీఐ అధికారులు సరైన ఆధారాలు సమర్పించలేదని పేర్కొంటూ కేసును కొట్టివేసింది. దీంతో నిందితులందరికీ బిగ్ రిలీఫ్ లభించింది.
ఈ క్రమంలోనే ఈ కేసును రాజకీయ కక్షతోనే పెట్టారని వారు ఆరోపించారు. అయితే తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఢిల్లీ మద్యం కేసులో క్లీన్‌చిట్ రావడంతో కల్వకుంట్ల కవిత.. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఈ కేసులో ఊరట లభించడంతో.. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని కవిత నిర్ణయించుకున్నారు. స్వామి వారిని దర్శించుకుని తన మొక్కులు చెల్లించేందుకు.. కాలినడకన అలిపిరి మెట్ల మార్గం నుంచి తిరుమల కొండకు చేరుకోవాలని నిర్ణయించారు.
ఈ మేరకు ఆమె పర్యటనకు సంబంధించిన వివరాలను.. కవిత సన్నిహితులు వెల్లడించారు. ఈనెల 5వ తేదీన కవిత తిరుపతికి చేరుకుంటారని.. అదే రోజున అలిపిరి మెట్ల మార్గం గుండా కాలినడకన తిరుమల కొండ ఎక్కనున్నట్లు తెలిపారు. కొండపైకి చేరుకున్న తర్వాత.. ఆ తర్వాతి రోజు అంటే ఈనెల 6వ తేదీన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు.
చాలా కాలంగా తనను వెంటాడుతున్న ఈ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎట్టకేలకు క్లీన్‌చిట్ రావడంతో ఆమె.. తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించేందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఆమె ఈడీ, సీబీఐ విచారణలు ఎదుర్కొవడమే కాకుండా అరెస్ట్ అయి.. తీహార్ జైలుకు కూడా వెళ్లారు. దాదాపు 6 నెలల పాటు జైలులో ఉన్నారు.
ఇక కవిత తిరుమల పర్యటన కేవలం ఆధ్యాత్మిక పర్యటన మాత్రమే కాదని.. రాజకీయంగా కూడా ఈ పర్యటనకు ప్రాధాన్యత ఉందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత తన భవిష్యత్ రాజకీయాలపై కవిత ప్రకటన చేసే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ జాగృతి ద్వారా ప్రజల్లో వివిధ కార్యక్రమాలు చేపడుతున్న కవిత.. వచ్చే 2 నెలల్లో కొత్త పార్టీని పెడతానని ఇప్పుటికే తేల్చి చెప్పారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa