రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయిస్తూ పంచాయతీ వ్యవస్థ బలోపేతానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత మరువలేనిదని ఆయన పేర్కొన్నారు. మంగళవారం నాడు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జరిగిన ఈ భేటీలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూఎస్, అటవీ శాఖలకు సంబంధించిన కీలక అంశాలపై ఇరువురూ చర్చించారు. ప్రధానంగా జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, గ్రామీణ రోడ్ల నిర్మాణం వేగవంతం చేయడం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చ సాగింది. నియోజకవర్గాల వారీగా జరిగిన నిధుల కేటాయింపులపై కూడా సమీక్షించారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లేందుకు సీఎం పలు విలువైన సూచనలు చేశారని పవన్ తెలిపారు.రాష్ట్రంలోని కొన్ని పంచాయతీల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన 'మేజిక్ డ్రెయిన్ల' పనితీరును పవన్ ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అన్ని పంచాయతీల్లో ఈ తరహా డ్రెయిన్లను నిర్మించడం ద్వారా పారిశుధ్య నిర్వహణను మరింత పకడ్బందీగా అమలు చేయవచ్చని వివరించారు. అలాగే, సాగునీటి పారుదల శాఖ పరిధిలోని డ్రైనేజీల్లో పూడికతీత పనులను వేసవిలోనే పూర్తి చేయాలని, దీనివల్ల పంటలు వేసే సమయానికి రైతులకు ఇబ్బందులు ఉండవని కోరారు. అటవీ శాఖ చేపట్టిన 'హనుమాన్ ప్రాజెక్ట్' వివరాలను కూడా పవన్ ముఖ్యమంత్రికి వివరించారు. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా సీఎం సూచనలను పాటిస్తూ ముందుకు సాగుతామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa