రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ మంగళవారం తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం తొమ్మిది మంది పేర్లతో కూడిన ఈ జాబితాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా ఉన్నారు. అయితే ఈయన్ను బీహార్ నుంచి పెద్దల సభకు నామినేట్ చేస్తూ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ విడుదల చేసిన ఈ జాబితాలో సీనియర్ నేతలతో పాటు పార్టీ విధేయులకు పెద్దపీట వేశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
బీహార్ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, శివేష్ కుమార్, ఒడిశా నుంచి ఆరాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, సిట్టింగ్ ఎంపీ సుజిత్ కుమార్, అస్సాం నుంచి రాష్ట్ర మంత్రి జోగన్ మోహన్, ఎమ్మెల్యే తేరాష్ గోవాలా, ఛత్తీస్‌గఢ్ నుంచి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు లక్ష్మి వర్మ, హర్యానా నుంచి సంజయ్ భాటియా, పశ్చిమ బెంగాల్ నుంచి ఆరాష్ట్ర బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు రాహుల్ సిన్హాను నామినేట్ చేశారు.
ఈ ఏడాది జనవరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్.. పార్టీ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా గుర్తింపు పొందారు. గతంలో బీహార్ ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణం, న్యాయశాఖ వంటి కీలక మంత్రి పదవులను నిర్వహించారు. ప్రస్తుతం ఆయన బంకీపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు రాజ్యసభకు వెళ్తుండటంతో ఆయన జాతీయ రాజకీయాల్లో మరింత క్రియాశీలక పాత్ర పోషించనున్నారు.
ఎన్నికల షెడ్యూల్ ఇదే..!
ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ బలం 133 కాగా, అందులో బీజేపీకి 103 మంది ఎంపీలు ఉన్నారు. మొత్తంగా మార్చి 16వ తేదీన 10 రాష్ట్రాల్లోని 37 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. వీటిలో అత్యధికంగా మహారాష్ట్రలో 7 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 6 చొప్పున స్థానాలు, బిహార్‌లో 4, ఒడిశా, అస్సాంలో 3 చొప్పున, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో రెండు చొప్పున స్థానాలు, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లలో ఒక్కొక్క స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న స్థానాల్లో తమ పట్టు నిలుపుకోవాలని బీజేపీ భావిస్తోంది. పార్టీ విధేయత, సామాజిక సమతుల్యత పాటిస్తూ ఈ అభ్యర్థులను ఎంపిక చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa