ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండియా తనే ఓ శక్తిగా ఎదగాలి,,,, సింగపూర్ మాజీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

international |  Suryaa Desk  | Published : Thu, Mar 05, 2026, 07:24 PM

భారత్, చైనా సంబంధాలపై సింగపూర్ మాజీ విదేశాంగ శాఖ మంత్రి జార్జ్ యెవో యాంగ్ బూన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైనాతో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడం భారత్‌కు వ్యూహాత్మకంగా ప్రయోజనం కలిగిస్తుందని.. అలా చేయడం చైనాకు కూడా ప్రయోజనకరమని బూన్ తెలిపారు. ఆగ్నేయాసియా దేశాల కోణంలో చూస్తే.. భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు తల్లిదండ్రులు గొడవ పడుతున్నట్లుగా ఉంటుంది. దీనివల్ల ఏ ఒక్కరూ ప్రశాంతంగా ఉండలేరు. భారత్, చైనా మధ్య గొడవలు లేకుండా, మంచి సామరస్యంతో కూడిన సంబంధాలను చూడాలని ఆగ్నేయాసియా దేశాలు కోరుకుంటున్నాయని యెవో చెప్పారు. ఆసియా ఖండంలో మారుతున్న వ్యూహాత్మక పరిణామాలను చాలా కాలంగా పరిశీలిస్తూన్న యెవోను భారత ప్రభుత్వం 2012లోనే పద్మ భూషణ్ పురస్కారంతో గౌరవించింది.


‘‘అమెరికా వైపు మొగ్గు చూపడం వల్ల భారత్ ఎక్కువగా ప్రయోజనం పొందొచ్చనే అభిప్రాయం గతంలో ఉండేది. కానీ అమెరికాతోనూ భారత్ సంబంధాలు సంక్లిష్టంగానే ఉన్నాయని ఇప్పుడు స్పష్టమవుతోంది. చైనాతోపాటు, ఇతర ప్రధాన దేశాలతో తన సంబంధాలను భారత్ ఎంతో జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి’’ అని యెవో సూచించారు. భారత్‌పై అమెరికా టారిఫ్‌లు విధించడం, వీసాలపై ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో సింగపూర్ మాజీ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.


‘భారత్ తన ఇండో-పసిఫిక్ వ్యూహంలో భాగంగా ఏదో ఒక పక్షం (చైనా, అమెరికాల్లో) వహించకూడదు. ఈ విశాల ప్రాంతంలో స్థిరత్వాన్ని కాపాడే శక్తిగా, శాంతి స్థాపకుడిగా తనను తాను మలుచుకోవాలి.. ఇదే భారత్‌కు అత్యంత తెలివైన ఇండో-పసిఫిక్ వ్యూహం అవుతుంది’ అని యెవో అభిప్రాయపడ్డారు. భారతదేశం యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకున్న తరహాలోనే.. ఆగ్నేయ ఆసియా, తూర్పు ఆసియా దేశాలతోనూ ఒప్పందం కుదుర్చుకోవాలి. దీని వల్ల దీర్ఘకాలిక వాణిజ్య పురోగతి గణనీయంగా మెరుగవుతుందని యెవో తెలిపారు.


ఏషియన్ (ఆగ్నేయాసియా దేశాల కూటమి) భారత్, చైనా మధ్య బఫర్ జోన్ లాంటివి. ఈ ప్రాంతంలో భారత్, చైనా నాగరికతలు రెండూ కలిసిపోయాయి. చైనా ఎదుగుదల వల్ల ఏషియన్ గణనీయంగా ప్రయోజనం పొందుతోంది. అలాగే భారత్ ఎదుగుదల కూడా ఏషియన్‌పై సానుకూల ప్రభావం చూపనుంది. బలమైన భారత్.. ఈ ప్రాంతానికి సమతుల్యతను తీసుకొస్తుంది. ఈ సమతూకానికి ఏషియన్ ఎంతో విలువనిస్తుంది అని యెవో చెప్పారు.


‘‘ఏషియన్ దేశాలకు భారత్ తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇక్కడ ఎంతో పొటెన్షియల్ ఉంది. ఏషియన్ భారత్‌కు పొరుగునే ఉంటుంది. చరిత్రపరంగా చూస్తే.. భారత్, ఆగ్నేయాసియా దేశాల మద్య సంబంధాల్లో ఘర్షణ లేదు. ఈ రెండింటి మధ్య వాణిజ్యం, సంస్కృతి, సహకారం ఉంది. ఏషియన్ దేశాలతో భారత్ నిలకడగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే.. రెండు పక్షాలకు లభించే ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉంటాయి’’ అని సింగపూర్ నేత అభిప్రాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa