ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ కాలంలో జరిగినట్లు ఆరోపణలు ఉన్న మద్యం స్కాం (AP Liquor Scam) కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ సిట్ నివేదికల ఆధారంగా కేసులు నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక చర్యలు చేపట్టింది.ఈ నేపథ్యంలో పలువురు ప్రధాన నిందితులకు భారీ షాక్ ఇస్తూ వారి ఆస్తులను పెద్ద ఎత్తున అటాచ్ చేసినట్లు ఈడీ ప్రకటన విడుదల చేసింది. దీంతో రాబోయే రోజుల్లో ఈ కేసు దర్యాప్తు మరింత వేగం పుంజుకుని కొత్త మలుపులు తిరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.మద్యం స్కాం కేసును విచారిస్తున్న హైదరాబాద్ ఈడీ విభాగం ప్రధాన నిందితులుగా భావిస్తున్న రాజ్ కెసిరెడ్డి, బూనేటి చాణక్య, వాసుదేవరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు, అనుబంధ సంస్థలకు చెందిన సుమారు రూ.441 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. షెల్ కంపెనీల ద్వారా సుమారు రూ.104 కోట్ల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు ఈడీ తన ప్రకటనలో పేర్కొంది.అటాచ్ చేసిన ఆస్తుల్లో నిందితుల బ్యాంక్ ఖాతాలు, బ్యాంక్ బ్యాలెన్సులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, భూములు వంటి ఆస్తులు కూడా ఉన్నాయి. ఈ స్కాం కారణంగా ప్రభుత్వానికి దాదాపు రూ.4,000 కోట్ల నష్టం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2019 తర్వాత మద్యం విధానంలో మార్పులు చేసి పాత బ్రాండ్లను మార్కెట్ నుంచి తొలగించినట్లు ఈడీ గుర్తించింది. అలాగే కొందరు ఫేవరెట్ బ్రాండ్లకు ప్రత్యేకంగా సరఫరా ఆర్డర్లు ఇచ్చినట్లు విచారణలో బయటపడింది. ప్రతి సరఫరా ఒప్పందంలో 15 నుంచి 20 శాతం వరకు కమిషన్లు తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. కమిషన్ చెల్లించని కంపెనీలకు సరఫరా ఆర్డర్లు నిలిపివేసిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చినట్లు ఈడీ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa