కర్ణాటక ముఖ్యమంత్రి పదవిపై జరుగుతున్న ప్రచారానికి తెరపడటం లేదు. అటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వర్గం.. సీఎం మార్పు లేనే లేదంటూ వ్యాఖ్యలు చేస్తుండగా.. ఇటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గం మాత్రం.. త్వరలోనే కర్ణాటక సీఎం పగ్గాలు డీకేఎస్ చేతికి వస్తాయనే ధీమాతో ఉన్నారు. ఇక మిగిలిన కాంగ్రెస్ నేతలు కూడా కొందరు తాము కూడా సీఎం రేసులో ఉన్నామంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం సిద్ధూ, డీకేఎస్‌ల మధ్యే ఉంది. గత కొన్ని నెలలుగా కర్ణాటక సీఎం మార్పుపై అనేక ఊహాగానాలు వస్తుండగా.. అటు సిద్ధూ, ఇటు డీకేఎస్ వాటిని ఖండిస్తూ.. కలిసిపోతున్నారు. అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితిలో కొంత మార్పు వస్తోంది.
ఉగాది పండగ తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని సాగుతున్న జోరు ప్రచారంపై సీఎం సిద్ధరామయ్య తాజాగా స్పందించారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి పీఠాన్ని వదలాలని తనకు సూచిస్తే.. వదిలిపెట్టేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సిద్ధూ తేల్చి చెప్పారు. పార్టీ ఆదేశాల మేరకు సీఎం పీఠం నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. తన సొంత నియోజకవర్గం వరుణలోని పిళ్లాహళ్లి హెలిప్యాడ్ వద్ద మీడియాతో శనివారం మాట్లాడిన సిద్ధరామయ్య.. కర్ణాటకలో అందరికంటే ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన సంతృప్తి తనకు ఉందని తెలిపారు.
పార్టీ హైకమాండ్ ఇంకా అవకాశం కల్పిస్తే మరో రెండుసార్లు బడ్జెట్ తానే ప్రవేశపెడతానని స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం ఏం చెబితే అది చేస్తానని.. హైకమాండ్ నిర్ణయానికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నానని తేల్చి చెప్పారు. పార్టీ పెద్దలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని సిద్ధరామయ్య పేర్కొన్నారు.
2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి.. అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలోనే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య సీఎం పీఠం విషయంలో తీవ్ర పోరు నడిచింది. పోటా పోటీగా రెండు వర్గాలు ఢిల్లీలో క్యాంప్‌లు వేసి మరీ హైకమాండ్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు జరిపాయి. కొన్ని రోజుల పాటు సాగిన ఉత్కంఠకు తెరదించిన కాంగ్రెస్ అధిష్ఠానం ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను, ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ను నియమించింది. అయితే ఇది రెండున్నరేళ్లు మాత్రమేనని.. ఆ తర్వాత ముఖ్యమంత్రి పగ్గాలు డీకే శివకుమార్‌కు అప్పగిస్తారనే ప్రచారం మొదటి నుంచీ జరుగుతున్నా అది మాత్రం నెరవేరడం లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa