ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్చి 28 నుంచి ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభం

sports |  Suryaa Desk  | Published : Sun, Mar 08, 2026, 08:55 PM

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్  19వ ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. ఈ మెగా టోర్నమెంట్ మార్చి 28న ప్రారంభం కానున్నట్లు అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ధృవీకరించింది. అయితే, దేశవ్యాప్తంగా జరగనున్న ఎన్నికల కారణంగా ఈసారి షెడ్యూల్‌ను రెండు భాగాలుగా విడుదల చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. సోమవారం నాడు తొలి భాగం షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది.పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మ్యాచ్‌ల తేదీలు, ఎన్నికల పోలింగ్ తేదీలు ఒకేసారి రాకుండా ఉండేందుకు బీసీసీఐ ఈ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎన్నికల కమిషన్ పూర్తి షెడ్యూల్‌ను ఖరారు చేశాక, ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌పై స్పష్టత రానుంది. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్స్‌పై ఇంకా అనిశ్చితి నెలకొంది.డిఫెండింగ్ ఛాంపియన్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రత్యర్థి ఎవరనేది షెడ్యూల్ విడుదలతో తేలిపోనుంది. 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌పై 6 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆర్‌సీబీ, 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించి తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి సుదర్శన్ 759 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలుచుకోగా, ప్రసిధ్ కృష్ణ 25 వికెట్లతో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ 'మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్'‌గా నిలిచాడు. మరోవైపు, 14 ఏళ్లకే ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసి సెంచరీతో రికార్డు సృష్టించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు ప్రాక్టీస్ క్యాంపులు ప్రారంభించి, కొత్త జెర్సీలను విడుదల చేస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa