చంద్రబాబు సోమవారం నంద్యాల జిల్లా కొత్త బురుజు గ్రామంలో రైతులకు కొత్త పట్టాదార్ పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతోందని స్పష్టం చేశారు. గత పాలకులు రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించారని, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో రైతులు, పేదల భూములను లాక్కునే ప్రయత్నం చేశారని ఆరోపించారు.రాజకీయ కక్ష సాధింపులు, అక్రమ ఆక్రమణల కోసమే గత ప్రభుత్వం 1.95 కోట్ల ఎకరాలను సెక్షన్ 22ఏ కింద నిషేధిత జాబితాలో పెట్టిందని సీఎం మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేసి, రికార్డుల్లోని తప్పులను సరిచేస్తున్నామని చెప్పారు. గత పాలకులు పాస్ పుస్తకాలపై, సర్వే రాళ్లపై తమ ఫోటోలు వేసుకుని రూ.750 కోట్లు వృథా చేశారన్నారు. రైతుల సమక్షంలోనే కొలతలు వేసి, వారి ఆమోదంతోనే ఎలాంటి అవినీతికి తావులేకుండా పారదర్శకంగా కొత్త పుస్తకాలు ఇస్తున్నట్లు వివరించారు. క్యూఆర్ కోడ్, బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగిస్తున్నామని, దీనివల్ల రికార్డులను ఎవరూ ట్యాంపరింగ్ చేయలేరని, అధికారులు తప్పు చేసినా ఇట్టే తెలిసిపోతుందని పేర్కొన్నారు.రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని సీఎం పునరుద్ఘాటించారు. ఇందుకోసం పూర్వోదయ పథకం కింద కేంద్రం రూ.30 వేల కోట్లు ఇస్తుందని తెలిపారు. కర్నూలులో డ్రోన్ సిటీ, అనంతపురంలో ఏరోస్పేస్ సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వం ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.32 వేల కోట్ల భారం మోపిందని, కూటమి ప్రభుత్వం ఛార్జీలు పెంచబోదని హామీ ఇచ్చారు. అలాగే, తిరుపతి లడ్డూ వ్యవహారంపై ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని, శ్రీవారి పవిత్రతను దెబ్బతీసే ఎలాంటి చర్యలనూ సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa