ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రీడ‌ల సాధ‌నతో విద్యార్థుల‌కు మంచి భ‌విష్య‌త్తు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 19, 2019, 08:09 PM

విద్యార్థులు చ‌దువుతోపాటు క్రీడ‌ల‌ను సాధ‌న చేయ‌డం ద్వారా శారీర‌కంగా, మాన‌సికంగా బ‌ల‌ప‌డ‌తార‌ని, త‌ద్వారా మంచి భవిష్య‌త్తు ఉంటుంద‌ని టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ సాంకేతిక విద్యాశాఖ‌, టిటిడి ఆధ్వ‌ర్యంలోని శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా పాలిటెక్నిక్ క‌ళాశాల సంయుక్తంగా చేప‌ట్టిన 24వ బాలిక‌ల జిల్లాస్థాయి అంత‌ర‌ పాలిటెక్నిక్ క‌ళాశాల‌ల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ గురువారం ఘ‌నంగా ప్రారంభ‌మైంది.ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈవో మాట్లాడుతూ విద్యార్థుల దిన‌చ‌ర్య‌లో క్రీడ‌లు భాగం కావాల‌ని, క‌ళాశాల‌ల్లో విధిగా సాధ‌న చేయించాల‌ని కోరారు. క్రీడ‌ల్లో గెలుపోట‌ములు భాగ‌మ‌ని, దీనివ‌ల్ల క్రీడాకారులు మాన‌సిక స్థైర్యంతో ఉంటార‌ని తెలిపారు. ఇటీవ‌ల విద్యార్థులు చ‌దువుపై ఎక్కువ శ్ర‌ద్ధ పెట్టి క్రీడ‌ల‌ను విస్మ‌రిస్తున్నార‌ని, దీనివ‌ల్ల జీవితంలో ఓట‌మి ఎదురైతే కుంగిపోతున్నార‌ని చెప్పారు.


టిటిడి క‌ళాశాల‌ల్లో చ‌క్క‌టి మైదానాలున్నాయ‌ని, విద్యార్థిని విద్యార్థుల‌ను క్రీడ‌ల్లో ప్రోత్స‌హిస్తున్నామ‌ని తెలిపారు. టిటిడి విద్యార్థులు జిల్లా, రాష్ట్ర‌స్థాయి, జాతీయ స్థాయిలో రాణించాల‌ని ఆకాంక్షించారు.


సాంకేతిక విద్యాశాఖ ఎస్‌వియు రీజ‌న‌ల్ జాయింట్ డైరెక్ట‌ర్ వి.ప‌ద్మారావు మాట్లాడుతూ విద్యార్థులు చ‌దువుకు, క్రీడ‌ల‌కు స‌మ ప్రాధాన్యం ఇవ్వాల‌న్నారు.క్రీడ‌ల్లో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన‌వారికి ఉన్న‌త విద్య‌లో, ఉద్యోగాల్లో రిజ‌ర్వేష‌న్ ఉంద‌ని, విద్యార్థులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు. 2020 జ‌న‌వ‌రిలో రాష్ట్రస్థాయిలో ఈ క్రీడాపోటీలు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు.


టిటిడి డిఎఫ్‌వో  డి.ఫ‌ణికుమార్ నాయుడు మాట్లాడుతూ క్రీడ‌ల్లో పాల్గొన‌డం ద్వారా మంచి వ్య‌క్తిత్వం, ఆత్మ‌విశ్వాసం అల‌వ‌డ‌తాయ‌న్నారు. టిటిడి విద్యాశాఖాధికారి డా. ఆర్.ర‌మ‌ణ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ టిటిడి ఒక క్రీడావిధానాన్ని రూపొందించి, మైదానాల‌ను అభివృద్ధి చేస్తోంద‌ని, విద్యార్థిని విద్యార్థుల‌ను ప్రోత్స‌హిస్తోంద‌ని వివ‌రించారు.


శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా పాలిటెక్నిక్ క‌ళాశాల ప్రిన్సిపాల్ డా. జి.అసుంత స్వాగ‌తోప‌న్యాసం చేశారు. ముందుగా క్రీడా మైదానంలో జాతీయ‌, క్రీడ‌, క‌ళాశాల జెండాల‌ను జెఈవో ఆవిష్క‌రించారు.అనంత‌రం క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడాకారులు క‌వాతు చేశారు. ఈ సంద‌ర్భంగా బెలూన్లు ఎగుర‌వేశారు. అనంత‌రం క్రీడాపోటీలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ కార్య‌క్ర‌మంలో పాలిటెక్నిక్ క‌ళాశాల‌ల కో-ఆర్డినేట‌ర్ డా. ఎల్‌.కృష్ణ‌సాయి, 29 పాలిటెక్నిక్ క‌ళాశాల‌ల నుండి క్రీడాకారిణులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa